కాకతీయ సుగర్ సిబ్బంది వైఖరి పై చెఱకు రైతుల ఆందోళన..

నవతెలంగాణ -అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రాంతంలోని చెరుకు సాగు చేసే రైతులు కాకతీయ సుగర్స్ స్థానిక సిబ్బంది పై శుక్రవారం నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజన అనంతరం తమ చెఱకు పంటను మధు కాన్ షుగర్ ఫ్యాక్టరీకి తరలించేవారు.గత నాలుగైదేళ్ళుగా అశ్వారావుపేట ప్రాంత రైతులందరూ మధు కాన్ షుగర్స్ తో ఒప్పందం చేసుకొని తమకు మద్దతు ధర లభిస్తుందని తమ పంటను రాజేశ్వర పురం లోని మధు కాన్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో కల్లూరు లోని కాకతీయ షుగర్ యాజమాన్యం అశ్వారావుపేట చెఱకు రైతులు వద్దకు వచ్చి పంటను తమ ఫ్యాక్టరీకి పంపించాలని కోరగా మద్దతు ధర ఇస్తున్న మధు కాన్ షుగర్స్ కే తమ పంటను అమ్ము తామని కాకతీయ షుగర్స్ కి అమ్మే ది లేదని తేల్చి చెప్పడంతో గతంలో కాకతీయ షుగర్స్ తరపున పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్ల సహాయంతో రైతులకు ఏమీ చెప్పకుండా రైతుల వద్ద నుండి అగ్రిమెంట్ పేపర్ల పై సంతకాలు తీసుకుని మధు కాన్ షుగర్స్ కి వెళ్తున్న చెఱకు లారీలను నిర్బంధించి సదరు రైతులు మాకు గతంలోనే అగ్రిమెంట్ చేశారని నెపంతో లారీలను అక్రమంగా ఆపి డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రైతులంతా సమావేశమై కాకతీయ షుగర్స్ యాజమాన్యం తీరుపై తీవ్రంగా వండి పడ్డారు. చెఱకు రైతుల సమావేశంలో సదరు రైతులు మాట్లాడుతూ గత 5 – 6 సంవత్సరాల నుండి మధు కాన్ చక్కెర కర్మాగారం వారితో రైతులకు సత్సంబంధాలు ఉన్నాయని, ఇతర ఫ్యాక్టరీ లతో పోల్చుకుంటే ధర, ప్రోత్సాహకాలు బాగున్నాయని సుమారు ఒక ఎకరాకు 6 నుండి 8 వేల రూపాయలు రైతుకు లాభం చేకూరుతుంది అని చెఱకు నాటి మధు కాన్ చక్కెర కర్మాగారం వారితో ఒప్పందం చేసుకొని ఉన్నాము. కాబట్టి రైతులు ఎవరు కూడా గందరగోళ పరిస్థితులకు లోనుకాకుండా మనకు ధర, ప్రోత్సాహకాలు ఇస్తున్న మధు కాన్ కర్మాగారానికి చెఱకు సరఫరా చేయాలనీ నిర్ణయించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. సదరు సమావేశంలో ముళ్లపూడి శ్రీనివాస రావు, చిన్నంశెట్టి శ్రీను, చిన్నంశెట్టి రాంబాబు, మెట్ట తులసీరావు, కొత్త ప్రవీణ్, చిన్నంశెట్టి కామేష్, మూల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.