ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ఉపాధి కూలీలు

– వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ-ఆలేరురూరల్‌
ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కాసేపు సేద తీరేందుకు నీడ లేక, తాగేందుకు నీళ్లు లేక పెరుగుతున్న ఎండ తీవ్రతతో కూలీలు అల్లాడుతున్నారని , నెలల తరబడి చేసిన పనికి డబ్బులు రాక కూలీలు తమ కుటుంబాలను పోషించుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.శనివారం ఆ సంఘం ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పటేల్‌గూడెంలో ఉపాధికూలీలు పని చేస్తున్న ప్రదేశాన్ని సందర్శించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మాట్లాడుతూ ఉపాధిహామీ చట్టంలో గతేడాది 10 వారాలు కూలీలు పనిచేస్తే వారికి చేసిన పనికి పే స్లిప్పులు ఇవ్వక,డబ్బులు చెల్లించకపోవడంతో కూలీలంతా ఆ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారోనని ఎదురుచూస్తు న్నారన్నారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న ఏపీవోలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు రోజువారీగా కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు, చేసిన పనికి వారం వారం ఇవ్వాల్సిన పే స్లిప్పులు, 15 రోజులకు ఒకసారి చెల్లించాల్సిన డబ్బుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.ఇప్పటికైనా ఉపాధి హామీలో పనిచేస్తున్న సిబ్బంది,కార్మికుల సమస్యలను నిరంతరం తెలుసుకొని పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు.సంబంధిత అధికారులు ఒకే మండలంలో మూడు నాలుగు ఏండ్లుగా తిష్ట వేసి కూలీల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు.వారందర్ని మార్చాలని జిల్లా అధికారులను కోరారు.మోడీ ప్రభుత్వ విధానాల వల్ల బ్యాంక్‌ అకౌంట్‌,ఆధార్‌ లింకు కోసం కూలీలు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.పేరుకే రోజుకు కూలీ 272 రూపాయలు ఇస్తామని చెప్పి కొలతల పేరుతో 150 రూపాయలు దాట్టడం లేదని 150 రూపాయలతో కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకుంటారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొలతలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన రూ.272 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.చట్టపరంగా పని ప్రదేశంలో నీడకోసం టెంట్లు, తాగడానికి మంచి నీళ్లు, పని ప్రదేశంలో మెడికల్‌ కిట్‌ ఉండాలని, అయినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన నిబంధనల ప్రకారం ఉదయం, సాయంత్రం రెండు సార్లు కూలీల ఫొటోలు తీసుకొని యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని, ఆధార్‌ బ్యాంకు లింక్‌ అని కొత్త కొత్త జీవోలు తెచ్చి కూలీలను భయభ్రాంతులకు గురి చేస్తున్న మోడీ ప్రభుత్వం వేతనాలు మాత్రం ఎందుకు సక్రమంగా చెల్లించడం లేదని ప్రశ్నించారు.ఇప్పటికైనా ప్రభుత్వం గడ్డపారలు,పారలు,ఇనుప తట్టలు, గొడ్డళ్లు, కొడవళ్లను అందించాలని, తాగునీటి కోసం గతంలో కూలీలకు రూ.5 చెల్లించేవారని వాటిని చెల్లించాలని కోరారు. ఏప్రిల్‌,మే నెలల్లో ఎండల్లో పనిచేసే కూలీలకు 20శాతం అదనపుభత్యం కూడా చెల్లించాలని, కొలతలతో సంబంధం లేకుండా చట్టప్రకారం రూ.272 చెల్లిస్తూనే, రోజు కూలి రూ.600 పెంచాలని కోరారు.ఉపాధి పని దినాలు 200 రోజులకు పెంచాలని, ప్రమాదబీమా సౌకర్యం కల్పించి, ప్రమాదంలో చనిపోయిన కూలీలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.వీటి సాధన కోసం, చట్ట పరిరక్షణ కోసం ఈ నెల 25న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర సదస్సు వ్యవసాయ కూలీలు, ఉపాధి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్‌, మండల అధ్యక్షులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు గ్యార అశోక్‌, మండల ఉపాధ్యక్షులు బొమ్మ శ్రీను, ఉపాధికార్మికులు బొమ్మకంటి జ్యోతి, నిలికొండ నిర్మల, మంజుల, లక్ష్మీ, దశరథ, ఊర్మిళ, భారతమ్మ, బీమగాని లత, ఏనుగు వెంకటరెడ్డి, పిక్క కొమరయ్య, మామిడాల చంద్రయ్య, బండ్రు పద్మ, చంద్రమ్మ, బాలనర్సయ్య, వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.