ఉజ్వల భవిష్యదర్శిని ‘హోమ్‌మేకర్‌’

కవిత్వం మానవ జీవన సారం.. స్త్రీ జీవన పక్షం వహిస్తూ శక్తివంతమైన కవిత్వం రాస్తున్న వారిలో నాంపల్లి సుజాత ప్రముఖులు. దశాబ్దన్నరగా కవితావరణంలో ‘నానీ’ల ప్రక్రియ ద్వారా ప్రవేశించారు. కవిత్వంలో హృదయ దు:ఖ భాషను మానవీయ కోణంలో అక్షరీకరించడమే కాక, పల్లె మట్టి పరిమళాన్ని శ్వేత పత్రంపై గుభాళింపజేయడంలో నిబద్ధత, నియగత, స్పష్టత, సామాజిక స్పృహ ఎంతో బలంగా చెప్పిన ఈ కవిత్వంలో సామాజిక ప్రయోజనం కనిపిస్తుంది, వినిపిస్తుంది.
కవయిత్రి ఈ సంపుటిని తన చెల్లి మణిమాలకు అంకితం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్థిక సహకారంతో ఈ పుస్తకం వెలువరించారు.
పోపులపెట్టె/ మశిగంత పేగు/ ప్రజ్ఞాపూర్‌/ సంతకం/ ‘అన్న’ వరకు/ వితంతు తంతు/ కుమ్మరివాము/ వీర బైరాన్‌ పల్లి/ దిశానిర్దేశం/ అలనాటి నెమలీక… లాంటి కవితలు కవయిత్రి భావాలకు అద్దం పడతాయి. ‘హోమ్‌మేకర్‌’ (పేజీ9) కవితలో చివరి వాక్యాలు అందర్నీ ఆలోచింపజేస్తాయి. ”జీత భత్యాలు, వారాంతపు సెలవులూ/ లేని వట్టి హోమ్‌మేకర్నేనట!!
లెక్కకు రాని రెక్కల కష్టం/ జాతీయాదాయంలో నన్ను కలుపరు!!/ ఈ చాకిరి పాడుగాను/ దీన్నుంచి విముక్తి ఎప్పుడో!” అంటారు. ఏంగెల్స్‌ అన్నట్లు స్త్రీ ఎక్కువగా దోపిడీకి గురౌతుతోంది అన్నది అక్షర సత్యం కదా!
అగాధంలోంచి అంతరీక్షం దాకా అన్నింటిలో విస్తరించిందీ నేనే! / ఏకకాలంలో ఇంటినీ, మింటినీ మోసే సవ్యసాచినీ సకల పరాశక్తినీ నేనే!!…/ మరుజన్మంటూ వుంటే మానవ మనుగడకే ప్రాణం పోసే మహిళనై పుట్టాలనే కోరుకుంటా అంటారు కవయిత్రి (పేజీ 18). ఎక్కడమ్మా నువ్వు లేనిదీ! అనే దేవేంద్ర పాట గుర్తుకొస్తుంది. ముప్పై ఏళ్లనాటి నా సంతకం -రూపురేఖలు మారాయట/ నా సొమ్ము నాకే చెల్లని చెక్కంటూ! (పేజీ 47) అంటారు సంతకం కవితలో.
‘నగరానికి నా వలస’ కవితలలో అంతర్జాతీయత సంతరించుకుంది. చివరి వాక్యాల్లో ఇలా అంటారు.. వలస జీవుల లెక్క పత్రాల కోసం వస్త్రగాలం పడుతున్నారట. అరిగి జీర్ణమైన ఆ దస్త్రాలని ఎక్కణ్నుంచి తెచ్చేదిప్పుడు? ఆకాశానికి గోడలు కట్టి ఆ సైబీరియా పక్షిని అడ్డుకోమను” ఇలా శక్తివంతమైన కవితలు పాఠకుల్ని ఆలోచింపజేస్తాయి.