రాజస్థాన్‌లో 68.70 శాతం పోలింగ్‌

న్యూఢిల్లీ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకూ 68.70 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల కమిషన్‌ అధికారులు తెలిపారు. 6 గంటల తరువాత క్యూలో ఉన్నవారికి ఓటింగ్‌కు వీలు కల్పించడంతో పోలింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశముంది. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, గవర్నర్‌ కలరాజ్‌ మిశ్రా, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, బీజేపీ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ప్రతిపక్ష రాజేంద్ర రాథోర్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవింగ్‌ సింగ్‌ డోటస్రా, విధాన సభ స్పీకర్‌, కాంగ్రెస్‌ నేత సీపీ జోషి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి అమ్రారామ్‌ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 అసెంబ్లీ స్థానాల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలు కాగా, ఒకటి, రెండు రాళ్లు రువ్వుకున్న సంఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్‌ జరిగినట్టు అధికారులు వెల్లడించారు. సికార్‌లోని బోచివాల్‌ భవన్‌, ఫతేపూర్‌ షెఖావతి సమీపంలో రాళ్ల దాడి జరిగింది. గతేడాది 70 శాతం ఓటింగ్‌ జరిగింది. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 1862 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా, 5.29 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. కొత్తగా ఈసారి 22.61 లక్షల మందికి ఓటు హక్కు లభించింది. 3 లక్షల మంది ఇప్పటికే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 51,890 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 2,74,000 మంది ప్రభుత్వ సిబ్బంది పోలింగ్‌ విధులు నిర్వహించగా, 1,71,000 మంది పోలీసు, భద్రతా సిబ్బంది మోహరించారు. ఈసారి ఎన్నికల బరిలో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, బీజేపీ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవింగ్‌ సింగ్‌ డోటస్రా, విధాన సభ స్పీకర్‌, కాంగ్రెస్‌ నేత సీపీ జోషి తదితర హేమాహేమీలు ఉన్నారు. డిసెంబర్‌ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఎన్నికల బహిష్కరణ
జైపూర్‌ జిల్లాలోని పాలావాలా జతన్‌ గ్రామస్థులు ఆ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఒక్క ఓటరు కూడా పోలింగ్‌ బూత్‌ వైపు కన్నెత్తి చూడలేదు. తమ గ్రామాన్ని సమీపంలోని తూంగా గ్రామంతో కలుపుతూ రోడ్డు వేయాలని పాలావాలా జతన్‌ గ్రామస్తులు అనేక ఏండ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాలు, అధికారుల ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. ఉదయం నుంచి ఒక్క గ్రామస్థుడు కూడా ఓటు వేసేందుకు రాకపోవడంతో పోలింగ్‌ బూత్‌ వెలవెలబోయింది. అక్కడి అధికారులు తప్ప ఓటర్లలెవరూ కనిపించలేదు. ఇప్పుడే కాదు.. గత ఏడు పర్యాయాలు ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉన్నారు.