– సెలవు రోజుల్లోనూ విధుల్లోనే…
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఓటరు గుర్తింపు కార్డుల బట్వాడాను వేగవంతం చేసినట్టు తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం తెలిసింది. ఈనెల 30వ తేదీలోపు ఓటర్లకు గుర్తింపు కార్డుల్ని పూర్తిగా బట్వాడా చేయాలని నిర్ణయించామనీ, దానికోసం ఆదివారం, గురునానక్ జయంతి వంటి ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా పోస్టుమేన్లు విధుల్లో ఉంటారని అసిస్టెంట్ డైరెక్టర్ (బీడీ) ఎన్‌ఎస్‌ఎస్ రామకృష్ణ తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డుల బట్వాడా కోసం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పోస్టాఫీసుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఓటరు గుర్తింపు కార్డు దారులకు పోస్టాఫీసుల ద్వారా మూడు దశల్లో సంక్షిప్త సందేశాలు (ఎస్‌ఎమ్‌ఎస్) వస్తాయనీ, వాటిని భద్రపరుచుకొని, నేరుగా సంబంధిత పోస్టాఫీసుల్లో కూడా ఓటరు గుర్తింపు కార్డులు తీసుకోవచ్చని వివరించారు. ఓటరు కార్డు బుకింగ్, పోస్ట్‌మ్యాన్ బట్వాడా చేసే సమయంలో, అందుకున్న తర్వాత ఎస్‌ఎమ్‌ఎస్‌లు వస్తాయని తెలిపారు. దీపావళి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 43 పోస్టాఫీసుల్ని ఓపెన్ చేసే ఉంచామనీ, 409 మంది పోస్ట్‌మేన్‌లు, సిబ్బంది దాదాపు 1.34 లక్షల ఓటరు గుర్తింపు కార్డుల్ని బట్వాడా చేశారని చెప్పారు. సకాలంలో గుర్తింపు కార్డుల్ని అందిస్తామనీ, ప్రజలు సహకరించాలని కోరారు.
అలాగే పోస్టల్ బ్యాలెట్లను కూడా సకాలంలో రిటర్నింగ్ అధికారులకు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈనెల 1 నుంచి 23వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4.96 లక్షల ఓటరు గుర్తింపు కార్డుల్ని బట్వాడా చేశామన్నారు.