– పాలకవర్గాలపై ఎస్‌డబ్ల్యూఎఫ్ ఫైర్ ప ఆర్టీసీ కార్మికుల్లో ధైర్యాన్ని నింపుతున్న వైనం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కోటి ఆశలతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నష్టపోయిందీ, అవమానాలకు గురైందీ, ఆర్థికంగా వెనుకబాటుకు గురైంది అక్షరాలా ఆర్టీసీ కార్మికులే. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు రెండుసార్లు వేతన సవరణలు జరిగాయి. కానీ ఆర్టీసీ కార్మికులకు 8 ఏండ్లుగా జీతాలు పెరగలేదు. పైగా వారికి రావల్సిన బకాయిల్ని చెల్లించడంలో కూడా ప్రభుత్వం ఇప్పటికీ తీవ్ర నిర్లక్ష్యాన్నే ప్రదర్శిస్తున్నది. ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నామని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రకటించినా, కార్మికుల మోముల్లో సంతోషాలు వెల్లివిరియలేదు. కారణం స్వరాష్ట్రంలో తాము ఏవైతే రావాలని కోరుకున్నారో అవి ఇప్పటికీ వారికి అందలేదు. పైపెచ్చు ఆర్టీసీ బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ఏటా రిటైర్ అవుతున్న వారి స్థానాల భర్తీకి కొత్త రిక్రూట్మెంట్లు లేవు. డబుల్ డ్యూటీల పేరుతో ఉన్నవారిపైనే అదనపు పనిభారాలు మోపుతున్నారు. ఇలాంటి దశలో టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్యూఎఫ్) కార్మికుల్లో విశ్వాసం, ధైర్యం, నమ్మకం కలిగించేందుకు విశేష కృషి చేసింది. ప్రతి సమస్య పైనా కరపత్రాలను ముద్రించి, క్షేత్రస్థాయిలో కార్మికుల్ని చైతన్యవంతుల్ని చేసేలా కృషి చేసింది. ఆ కరపత్రాలు చదివి అర్థం చేసుకున్న కార్మికులు తమ తమ యూనియన్లలో ఆ సమస్యలపై మీరెందుకు మౌనంగా ఉంటున్నారు అని ప్రశ్నించే స్థితిని ఎస్‌డబ్ల్యూఎఫ్ కల్పించింది. కార్మికుల నుంచి వచ్చిన ఆ ఒత్తిళ్ల ఫలితంగానే 49,776 మంది ఆర్టీసీ కార్మికులు 2019 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 29వ తేదీ వరకు జరిగిన చారిత్రాత్మక 52 రోజుల సమ్మెలో భాగస్వాములు అయ్యారు. ఈ సమ్మె విచ్ఛిన్నానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నంలేదు. ఉద్యోగాల నుంచి తీసేస్తాం అని బెదిరించినా, కార్మికులు ఐక్యంగా నిలిచి, ప్రభుత్వంపై పోరాటానికే ‘సై’ అన్నారు. సమ్మె ఎక్కడ సడలుతుందో అనే భయంతో పలుచోట్ల కార్మికులు ఆత్మార్పణలకూ పాల్పడ్డారు. ఆశ నిరాశల మధ్యే ఆ సమ్మెను కార్మికులు విరమించుకొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాతా వారిపై వేధింపులు తీవ్రస్థాయికి చేరాయి. అప్పుడూ కరపత్రాల రూపంలో వారికి ఎస్‌డబ్ల్యూఎఫ్ ధైర్యానిచ్చింది. తమ శక్తిమేరకు బహిరంగ ఆందోళనలు నిర్వహించింది. ఆర్టీసీలో కార్మిక సంఘాలే లేవు అని ప్రభుత్వం ప్రకటిస్తే, ఏ చట్టం ప్రకారం నిషేధిస్తున్నారో చెప్పండంటూ తన గళాన్ని వినిపించి, పాలకవర్గంపై ధిక్కార స్వరాన్ని పెంచింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే, మాకు రావల్సిన రెండు వేతన సవరణలు, డిఏలు, పీఎఫ్, సీసీఎస్ సహా ఇతర బకాయిలు సొమ్ము సంగతేంటని నిలదీసింది. మును గోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల ఓట్ల కోసం పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. చివరకు వేతన సవరణ చేస్తాం …మాకు అనుమతి ఇవ్వండంటూ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖరాసే పరిస్థితి ఏర్పడింది. ఆ ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్థి విజయం సాధించాక, మళ్ళీ ఆర్టీసీ కార్మికుల ముఖం చూసేందుకు ప్రభుత్వం ప్రయత్నించలేదు. దీన్నీ ఎస్‌డబ్ల్యూఎఫ్ ఎత్తిచూ పింది. ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చిన్నచూపును ఎక్కడికక్కడ, ఎప్పట కప్పుడు నిలదీస్తూ కార్మికుల్లో అదే పోరాట స్ఫూర్తిని నిలిపి ఉంచేందుకు శతధా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తు న్నామని ప్రకటిస్తే, విధివిధానాలపై చర్చ జరగాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ పట్టుపట్టింది. ప్రభుత్వ కమిటీలో కార్మిక సంఘా లకు ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈపీఎఫ్‌కు సంబం ధించిన అనేక అంశాల పై కార్మికులకు అవగాహన కల్పిస్తూనే, సంబంధిత విభాగాధిపతులకు లేఖలు రాస్తూ, కార్మికుల సంక్షే మం పట్ల తమకున్న చిత్తశుద్ధి, అంకితభావాన్ని వెల్లడి స్తూనే ఉంది. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మికుల సంఖ్య 42,300 కి తగ్గింది. సమీప భవిష్యత్‌లోనూ ఖాళీ పోస్టుల్ని భర్తీ చేసే పరిస్థితులు కనిపించట్లేదని ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఆ క్రమంలోనే కార్మిక సంఘాల మధ్య ఐక్యత, సమైక్య పోరాటాలకు బాటలు వేసే దిశగా ఎస్‌డబ్ల్యూఎఫ్ కృషి పెరుగుతూనే ఉన్నది.
చాలా పరిష్కారం కావాలి
కార్మికుల్లో ఉద్యమ చైతన్యం పెరుగుతున్నది. అదే సందర్భంలో పరిష్కారం కావల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. తాత్కాలికంగా కొన్ని సమస్యలు పరిష్కారం అయినా, అవి కార్మికులకు హక్కుగా రావల్సినవే. గడచిన 8 ఏండ్లలో ఆర్టీసీ కార్మికులు పడిన గోస అంతాఇంతా కాదు. ఇప్పటికీ ఆ వేధింపులు, శ్రమదోపిడీ కొనసాగుతూనే ఉన్నాయి. కార్మికులు ఆర్థికంగా నష్టపోయి, మానసికంగా కుంగిపోతున్నారు. ఈ సమయంలో వారిలో ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత కచ్చితంగా కార్మిక సంఘాలదే. మేం అదే పని చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో అనేక సందర్భాల్లో సంస్థలోని అనేక సంఘాలు కూడా మాతో కలిసివస్తున్నాయి. అంతి మంగా మా లక్ష్యం కార్మికుల శ్రేయస్సు, సమాజం లో గుర్తింపు, గౌర వం. దానికోసం శక్తివం చన లేకుండా ప్రయ త్నిస్తూ నే ఉంటాం. ఐక్య పోరాటాలు ,విజయా ల కోసం నిరం తరం శ్రమి స్తూనే ఉంటాం.
వీఎస్ రావు, ప్రధాన కార్యదర్శి, టీఎస్ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్