– కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కేసీఆర్‌కు వేసినట్టే :బీజేపీ విజయ సంకల్పసభలో అమిత్ షా
నవతెలంగాణ – పటాన్‌చెరు/చౌటుప్పల్
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం నేత ఓవైసీ చేతిలో ఉన్నదని, దాన్నుంచి త్వరలోనే తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పిస్తామని కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు, యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గాల్లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభకు ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలోనూ బీజేపీ గెలిస్తేనే దేశానికి భద్రత సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలిస్తే ఎంఐఎం వంటి మతోన్మాద శక్తులకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని, బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే ఓవైసీకి వేసినట్టేనని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో అవినీతి రాజ్యమేలుతోందని, పేపర్ లీకేజీలు, నిరుద్యోగం పెరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు కేసీఆర్ సర్కారే కారణమన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన ఘనత బీజేపీదేనని తెలిపారు. ఒక్క సారి ఓటేస్తే రెండు పనులు అవుతాయని, ఒక ఓటు ఎమ్మెల్యేకు వేసి మరో ఓటు మోడీకి వేసి ప్రధానమంత్రిని చేయాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లను గెలిపిస్తే గెలిచిన తర్వాత బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారని తెలిపారు. ఈ రోడ్డు షోల్లో పటాన్‌చెరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్, మునుగోడు బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు గోదావరి అంజిరెడ్డి, డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.