– బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టే
– కాంగ్రెస్ అవినీతి సొమ్ముతో గెలవాలని చూస్తోంది : త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్
నవతెలంగాణ-భద్రాచలం రూరల్/ వెంకటాపురం
ప్రజా సమస్యలపై పోరాడే వారికే పట్టం కట్టి, భద్రాచలం గొంతుక కారం పుల్లయ్యను అసెంబ్లీకి పంపించాలని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ప్రజల్ని విభజించి పాలించాలని చూస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి బీఆర్‌ఎస్ సర్కార్ బీ టీంగా వ్యవహరిస్తోందని, బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆదివాసీలపై అనేక రకాల దాడులను ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి కారం పుల్లయ్య విజయాన్ని కాంక్షిస్తూ శనివారం భద్రాచలం పట్టణంలో మాణిక్ సర్కార్ రోడ్ షో నిర్వహించారు. బ్రిడ్జి సెంటర్ చెక్‌పోస్టు పాయింట్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు కూడా అక్రమంగా సంపాదించిన సంపాదనతో ఎన్నికల్లో గెలవాలని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో చైతన్యవంతులు కాబట్టే 30 ఏండ్లపాటు భద్రాచలంలో ఎర్రజెండా రెపరెపలాడిందని గుర్తు చేశారు. మరోసారి ప్రజల చైతన్యాన్ని చూపించే సమయం వచ్చిందని, ఆదివాసీ, ఏజెన్సీ గడ్డపై మతోన్మాద విషం జిమ్మకుండా ఉండాలంటే ఎర్రజెండా పార్టీలను ప్రజలు గెలిపించాలని కోరారు. ఈ ప్రాంత సమస్యలపై మిడియం బాబురావు ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో చర్చించి ఆదివాసీలకి అటవీ హక్కుల చట్టాన్ని సాధించారని గుర్తు చేశారు. సున్నం రాజయ్య, కొంజా బొజ్జి తమ పదవీకాలం మొత్తం ఈ ప్రాంత అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలో సీపీఐ(ఎం) కార్యకర్తలు తమ ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారని, అటువంటి పార్టీకి ఓటు వేసి అసెంబ్లీకి పంపిస్తే భద్రాచలం నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. భద్రాచలం అభ్యర్థి కారం పుల్లయ్య మాట్లాడుతూ.. ఐదేండ్లుగా నిలిచిపోయిన అభివృద్ధిని పున: ప్రారంభించాలంటే ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) గెలిచి తీరాలన్నారు. కాగా, రోడ్ షోకి పట్టణం నుంచి ప్రజలు తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ డోలు, కోయలు, తీన్మార్ డాన్స్‌లతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రోడ్ షోలో మాజీ ఎంపీ మీడియం బాబురావు, భద్రాద్రి జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, సీనియర్ నాయకులు ఎల్లమంచిలి రవికుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆ మూడు పార్టీలకు బుద్ది చెప్పండి
బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లనుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఎర్రజెండా పట్టుకుని పోరాడాలని త్రిపుర మాజీ సీఎం, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ పిలుపునిచ్చారు. భద్రాచలం నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి కారంపుల్లయ్య గెలుపును కాంక్షిస్తూ ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురంలో శనివారం కొప్పుల రఘుపతి అధ్యక్షతన సభ, ర్యాలీ జరిగింది. మాణిక్ సర్కార్ మాట్లాడుతూ.. దేశాన్ని విభజించి పాలించే రీతిలో బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. గతంలో మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి అటవీ హక్కుల చట్టం సాధించుకున్నామని గుర్తు చేశారు. ఆ చట్టం అమలులో కాంగ్రెస్, తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు. ఆ దారిలోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానం ఉందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎంతమంది గిరిజనులకు హక్కుపత్రాలు ఇచ్చింరని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం పెరిగిందన్నారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించే కమ్యూనిస్టులను అసెంబ్లీకి పంపాలని కోరారు. కారం పుల్లయ్యను గెలిపించాలని పిలునిచ్చారు. ఎర్రజెండా వ్యక్తులను అసెంబ్లీకి పంపితే ప్రజాస్వామ్య హక్కులకై నిలబడుతారన్నారు. ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిసభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, అభ్యర్థి కారం పుల్లయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, సూడి కృష్ణా రెడ్డి, మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సాంబశివ తదితరులు పాల్గొన్నారు.