– యాదవులను కించపరుస్తూ చేసిన
– వ్యాఖ్యలను రేవంత్‌రెడ్డి వెనక్కి తీసుకోవాలి
– ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
నవతెలంగాణ-నల్లగొండ
కుల వృత్తులను ఆదరిస్తున్న ప్రభుత్వం మాదని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. యాదవ, కుర్మలను, యాదవుల కులవత్తిని కించపరుస్తూ, యాదవ సామాజిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి వెంటనే యావత్ యాదవ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ జిల్లాకేంద్రంలో యాదవ, కుర్మల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ, ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ అనంతరం, క్లాక్ టవర్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను సదర్ దున్నరాజులతో తొక్కించి, నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నోముల భగత్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కులవృత్తులను ఏనాడూ పట్టించుకోలేదని, కులవృత్తులకు ఊతమిచ్చిన ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, యాదవులను, యాదవుల కులవత్తిని అవమానించేలా వ్యాఖ్యలుచేయడం యావత్ యాదవ, కుర్మ జాతి ఖండిస్తున్నదని, యాదవులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఈనెల 24వ తేదీ లోపు రేవంత్‌రెడ్డి యాదవులకు క్షమాపణ చెప్పకుంటే, 25వతేదీన పెద్దయెత్తున గాంధీభవన్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన ర్యాలీలో ప్రతి సంవత్సరం సదర్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా తెప్పించే దున్నపోతులను కూడా హైదరాబాద్ నుండి తెప్పించి వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు, యాదవ, కుర్మల జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ లొడంగి గోవర్ధన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు సోమనబోయిన సుధాకర్ యాదవ్, నూక కిరణ్ యాదవ్, సాదం సంపత్ కుమార్ యాదవ్, చీర పంకజ్ యాదవ్, గుండెబోయిన అయోధ్య యాదవ్, ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్, ఓయూ జెఏసి ఛైర్మన్ మన అశోక్ యాదవ్, ఓయూ జెఏసి అధ్యక్షుడు నక్క శ్రీశైలం యాదవ్, జవ్వాజి వెంకటేశం యాదవ్, ఈరటి బాలరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.