– ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా స్పష్టీకరణ
బీజింగ్/జెనివా : ఉత్తర చైనాలో చిన్నారుల్లో వేగంగా విజృంభిస్తోందన్న శ్వాసకోశ సంబంధిత వ్యాధి సాధారణమైనదేనని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కొత్త వైరస్ చైనాలో విస్తరిస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) వివరాలు కోరగా..బీజింగ్ స్పందించింది. చైనాలో నిమోనియా విజృంభనపై తమకు నివేదిక అందిందని డబ్ల్యుహెచ్‌ఒ నిర్ధారించింది. శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలే అని బీజింగ్ ఆ నివేదికలో స్పష్టంచేసిందని డబ్ల్యుహెచ్‌ఒ తెలిపింది. బాధితుల్లో ఎటువంటి కొత్త వైరస్ లేదని పేర్కొంది. ఈ విషయాన్ని చైనా స్థానిక మీడియా కూడా ధ్రువీకరించింది. చైనాలో శరవేగంగా వ్యాపించిన శ్వాసకోశ సమస్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు కేవలం 24 గంటల్లోనే కచ్చితమైన సమాచారం అందించిందని సిజిటిఎన్ వార్తా సంస్థ తెలిపింది. బీజింగ్, లియోనోంగ్‌లో చేసిన పరీక్షల్లో ఎటువంటి కొత్త వైరస్‌ను గుర్తించలేదని పేర్కొంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌ను సంప్రదించింది. బీజింగ్ పిల్లల ఆస్పత్రిని కూడా సమాచారం కోరింది. దీనిపై ఆస్పత్రి శ్వాసకోశ విభాగం డైరెక్టర్ ఝావో షన్నియింగ్ మాట్లాడుతూ.. ‘మేము సిడిసి నుంచి పొందిన డేటా ప్రకారం మైకోప్లాస్మాలో ఎటువంటి మార్పు లేదు. రోగులకు చికిత్సలో సంక్లిష్టతలు ఏమీ రాలేదు. మైకోప్లాస్మా నిమోనియా చైనాలో చాలా ఏళ్ల నుంచి ఉనికిలో ఉంది. దీనికి కచ్చితమైన రోగ నిర్ధారణ లేదు. కానీ, మాకు ఈ చికిత్సలో చాలా అనుభవం ఉంది. ప్రారంభ దశలోనే చికిత్సను అందిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు’ అని పేర్కొన్నారు.