లిక్కర్‌ కుటుంబాన్ని జైలుకు పంపుతాం

లిక్కర్‌ కుటుంబాన్ని జైలుకు పంపుతాం– కేసీఆర్‌కు విశ్రాంతి ఇవ్వండి
– గజ్వేల్‌లో ఓడిపోతాననే మరోచోటకు కేసీఆర్‌ : తూప్రాన్‌, నిర్మల్‌ విజరుసంకల్ప్‌ సభల్లో ప్రదాని మోడీ
నవతెలంగాణ/గజ్వెల్‌, తూప్రాన్‌ రూరల్‌ (మనోహరాబాద్‌)/
ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
”రాష్ట్రంలో ప్రజా సంక్షేమం పట్టని ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఇక విశ్రాంతి ఇద్దాం.. లిక్కర్‌ కుటుంబాన్ని జైల్‌కు పంపుదాం” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌, నిర్మల్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విజయ సంకల్ప సభల్లో మోడీ ప్రసంగించారు. ‘ప్రజలకు అందుబాటులో ఉండరు.. ప్రగతి భవన్‌, ఫాంహౌజ్‌కు పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రానికి అవసరం లేదు. ఆయన సేవలకు సెలవు ఇద్దాం. పదేండ్లలో కేసీఆర్‌ కనీసం సచివాలయానికి కూడా వెళ్లలేదు’ అని మోడీ విమర్శించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. స్కాంల పేరిట ఈ రెండు కుటంబాలు స్కాంలు చేస్తున్నాయని ఆరోపించారు. సోనియాగాంధీ, కేసీఆర్‌ కుటుంబాల స్కాంలపై విచారణ జరుగుతోందని, మొబైల్‌ మార్చినంత మాత్రాన మోసాలు బయటకు రాకుండా ఉండవన్నారు. కొందరు బెయిల్‌పై బయట తిరుగుతున్నారని, బీజేపీ ప్రభుత్వం రాగానే వారిని జైల్‌కు పంపడం మోడీ గ్యారంటీ అని అన్నారు. గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్‌పై ఓడిపోతాననే కేసీఆర్‌ మరో నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను కోరారు. బీజేపీ అభ్యర్థులు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, నంధీశ్వర్‌గౌడ్‌, మురళీదర్‌యాదవ్‌, పంజా విజరుకుమార్‌, రాజు ముదిరాజ్‌, దేవి శ్రీకాంత్‌రెడ్డి తూప్రాన్‌ సభలో పాల్గొన్నారు.
ధరణి పేరుతో బీఆర్‌ఎస్‌ భూ మాఫియా
తెలంగాణ ప్రభుత్వం పేదల భూములు లాక్కొనేందుకే ధరణి తీసుకొచ్చిందని భూమాఫియాకు పాల్పడుతోందని ప్రధాని ఆరోపించారు. తెలంగాణలో వేల కోట్ల సాగునీటి కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ సుల్తాను పాలన సాగిస్తే.. బీఆర్‌ఎస్‌ నిజాం పాలనను తలపిస్తోందని తెలిపారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రాగానే పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామని హామీనిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేశామన్నారు. 2024లోనూ కేంద్రంలో తమ ప్రభుత్వమే వస్తుందన్నారు.