ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న సీపీఐ(ఎం)

– సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేయండి : భద్రాచలంలో బృందా కరత్‌
నవతెలంగాణ-చర్ల
ప్రజా పోరాటాలు చేస్తూ పేద ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న సీపీఐ(ఎం)ని ఆదరించాలని ఆపార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ బృందా కరత్‌ అన్నారు. భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కారం పుల్లయ్య విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం చర్ల మండల కేంద్రంలో మండల కార్యదర్శి కారం నరేష్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎర్రజెండాను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన గళం వినిపించడానికి అసెంబ్లీలో సీపీఐ(ఎం) ప్రాతినిధ్యం ఉండాలన్నారు. తెలంగాణ జనాభా లెక్కల ప్రకారం.. 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న అసెంబ్లీలో కనీసం 17 మంది గిరిజన ఎమ్మెల్యేలు ఉండాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందని తెలిపారు.
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేసి, పోరాటాలు చేసింది ఎర్రజెండానేనని గుర్తు చేశారు. మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబురావు, తాను కలిసి అటవీ హక్కుల చట్టాన్ని 2006లో తీసుకువచ్చామని గుర్తుచేశారు. అటవీ ప్రాంతంలో ఆదివాసీల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరించి వేశాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఆదివాసీల భూములపై ప్రభుత్వం హరితహారం పేరుతో ఆక్రమణకు పాల్పడుతుంటే, కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. ఆదివాసీలు సమాజంలో పౌరులు కారా అని ప్రశ్నించారు. 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో పెసా చట్టం తుంగలో తొక్కి యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక గ్రామ సభల తీర్మానంకు విలువ లేకుండా పోయిందన్నారు. పేదల పక్షాన నిలబడి వారి కోసం పోరాటం చేస్తున్న కారం పుల్లయ్యను గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు.
కమ్యూనిస్టులకు పట్టం కట్టండి
సబ్బండ వర్గాలకు ఎంతో జీవనోపాధి అందిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చిన సీపీఐ(ఎం)కి పట్టం కట్టాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ పిలుపునిచ్చారు. పోడు భూముల చట్టాన్ని అమలు చేయడం కోసం కారం పుల్లయ్య నిర్విరామంగా కృషిచేసారన్నారు. కారం పుల్లయ్య గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా కష్టించి పని చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మిడియం బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, బండారు రవికుమార్‌, ఎమ్మెల్యే అభ్యర్థి కారం పుల్లయ్య, నాయకులు ఎలమంచిలి రవి, సీఐటీయూ రాష్ట్ర నాయకులు మధు, జిల్లా కమిటీ సభ్యులు కే.బ్రహ్మచారి, రేపాకుల శ్రీనివాస్‌, సీపీఐ(ఎం) సర్పంచులు సమ్మక్క, కృష్ణవేణి, సంధ్య, వెంకటేశ్వర్లు మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.