కేసీఆర్‌ ఇందిరమ్మ అనుచరుడే

కేసీఆర్‌ ఇందిరమ్మ అనుచరుడే – మన్మోహన్‌ సర్కార్‌లో మంత్రి కూడా
– తొమ్మిదేండ్లలో ఏమి చేశారో చెప్పాలి?
– ఐదు నెలల కర్ణాటక ముచ్చటెందుకు? : జైరాం రమేశ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇందిరమ్మ పరిపాలించిన కాలంలో ఆమె అనుచరుల్లో కేసీఆర్‌ కూడా ఒకరని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ గుర్తుచేశారు. అదే విధంగా యూపీఏ ప్రభుత్వం ప్రధాని మన్మోహన్‌ మంత్రివర్గంలో కేసీఆర్‌ మంత్రిగా పని చేశారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అవన్ని మరిచిపోయి ఇందిరమ్మ రాజ్యమంటే… కాంగ్రెస్‌ ప్రభుత్వమంటే అంటూ విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఏమి చేశారో చెప్పాలని అడిగితే, ఐదు నెలల కర్ణాటక కాంగ్రెస్‌ పాలనపై చెప్పాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమయినందునే దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తూ, సెంటిమెంట్‌ మళ్లీ మళ్లీ రగిల్చే ప్రయత్నం చేస్తున్నదని ఆయన విమర్శించారు. అభివద్ధి, ఉపాధి కల్పన, సామాజిక న్యాయం చేయని బీఆర్‌ఎస్‌ ఎన్నికల ఎజెండా అంశాన్ని మారుస్తున్నదని తెలిపారు. ఇలాంటి దృష్టి మళ్లించే విద్యలో సీఎం కేసీఆర్‌, పీఎం నరేంద్రమోడీ ఇద్దరూ ఒక్కటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలను విమర్శించే కేసీఆర్‌ ఆ రాష్ట్రాలకు వెళ్లి చూడాలని సూచించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు సమయంలో యూపీఏ వేసిన మంత్రుల కమిటీకి బీఆర్‌ఎస్‌ (నాటి టీఆర్‌ఎస్‌) ఎలాంటి సూచనలు చేయలేదని తెలిపారు. పార్లమెంటు బిల్లు ఆమోదం పొందే సమయంలో ఆ పార్టీ ఎంపీలు హాజరు కాలేదన్నారు. విభజన హామీల కోసం ఏనాడూ బీఆర్‌ఎస్‌… బీజేపీని నిలదీయలేదనీ, పట్టుపట్టలేదని తెలిపారు. విభజన హామీల్లో ఇబ్బందులుంటే వాటి సవరణల కోసం పార్లమెంటులో ప్రయత్నం చేయలేదని విమర్శించారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ధనిక రాష్ట్రంగా ఇస్తే అభివృద్ధిని అన్ని జిల్లాలకు, సంక్షేమాన్ని అన్ని వర్గాలకు అందించడంలో బీఆర్‌ఎస్‌ ఘోరంగా విఫలమైందని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికల ముందు ప్రకటించే సంస్కృతి కాంగ్రెస్‌ కు లేదని స్పష్టం చేశారు. 10 మంది సీఎం అభ్యర్థులుండటం తమ పార్టీ బలాన్ని సూచిస్తున్నదని తెలిపారు.
ఉద్దేశపూర్వకంగానే హరీశ్‌ వ్యాఖ్యలు
రైతుబంధుకు సంబంధించి సీఎం కేసీఆర్‌ డైరెక్షన్‌లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి ఆడిన డ్రామా అని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రజలను నమ్మకద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.