ఉగాండా : ఆఫ్రికా దేశం ఉగాండా చరిత్ర సృష్టించింది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయర్ – 2023 పోటీలలో ఆ జట్టు గురువారం రువాండాను ఓడించింది.
ఓఅంచనాలను తలకిందులు చేస్తూ ఉగాండా క్రికెట్ జట్టు.. వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయర్ 2023 పోటీలలో ఆ జట్టు గురువారం రువాండాను ఓడించడంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్రపంచకప్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఐసీసీ మెగా టోర్నీలో ఉగాండా ఆడనుండటం ఇదే ప్రథమం.
ఆఫ్రికన్ రీజియన్ క్వాలిఫయర్స్‌లో భాగంగా ఏడు దేశాలతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఇదివరకే నమీబియా ఆడిన ఐదు మ్యాచ్‌లకూ ఐదింటిని గెలుచుకుని పది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఉగాండా జట్టు ఆరు మ్యాచ్‌లలో ఏకంగా ఐదు గెలిచి పది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు వరల్డ్ కప్‌కు క్వాలిఫై అవుతాయని ఇదివరకే ఐసీసీ వెల్లడించిన విషయం తెలిసిందే.
తొలుత బ్యాటింగ్ చేసిన రువాండా.. 18.5 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఎరిక్ దుసిన్ (19) టాప్ స్కోరర్. ఉగాండా బౌలర్లలో అల్పేష్ రంజానీ , దినేశ్ నక్రానీ, సెనెయోందొ , కెప్టెన్ మసాబా తలా రెండు వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యాన్ని ఉగాండా.. 8.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. నమీబియా, ఉగాండాలు క్వాలిఫై అవడంతో జింబాబ్వే, కెన్యా, నైజీరియా, టాంజానియా, రువాండాలు నిష్క్రమించాయి.
ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్లు
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, కెనడా (అమెరికా క్వాలిఫయర్), నేపాల్, ఓమన్ (ఆసియా క్వాలిఫయర్), పపువా న్యూ గినియా ((ఈస్ట్ ఆసియా పస్‌పిక్), ఐర్లాండ్, స్కాట్లాండ్ (యూరప్ క్వాలిఫయర్), నమీబియా, ఉగాండా (ఆఫ్రికా క్వాలిఫయర్) జట్లు అర్హత సాధించాయి. ఆతిథ్య హౌదాలో విండీస్, అమెరికాలు ఆడనున్నాయి.