– నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఘటనపై రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాజకీయ లబ్ది కోసం చేస్తున్న సీఎం కేసీఆర్ పన్నాగాలు ఫలించవని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఆయనవి దింపుడు కల్లం ఆశలేనని చెప్పారు. ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ప్రభావం చూపాల్సిన అవసరం లేదన్నారు. వివాదాలను సామరస్యంగా సరైన పరిష్కారం చూపించే బాధ్యత మాది అన్నారు. గురువారం కొడంగల్ నియోజకవర్గంలో ఓటు వేసిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. నాగార్జున సాగర్ ఘటనపై స్పందించారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని కోరారు. ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కండ్లకు కట్టినట్టు కనిపిస్తున్నదని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరారు.తొమ్మిదేండ్లుగా కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. వీటన్నింటికి శాశ్వత పరిష్కారం ప్రజామోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడటమేనని చెప్పారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తామన్నారు. దేశాల మధ్య నీటి వాటాలు పంచుకుంటామన్నారు. అలాంటిది రాష్ట్రాల మధ్య వాటాలు పంచుకోలేమా? అని ప్రశ్నించారు. నీటి వాటాలు, ఆస్తుల పంపకాల విషయంలో కాంగ్రెస్ సమయస్ఫూర్తి,సమన్వయంతో వ్యవహరిస్తుందన్నారు. అవసరమైనప్పుడు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ ఉపయో గించుకుంటున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు.
సాగర్ డ్యామ్‌పై హైడ్రామా కేసీఆర్ పనే : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాగర్ డ్యామ్‌పై పోలీసుల హైడ్రామా సీఎం కేసీఆర్ పనేనని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతున్నారంటూ కేసీఆర్‌కు అర్థమై తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారని విమర్శించారు. ఇన్ని రోజులు లేని హడావిడి పోలింగ్ రోజే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ, ఏపీ పోలీసులు కలిసి చేసే డ్రామాలు ఎవరూ నమ్మవద్దని కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎన్నికల కోసం వాడుతున్నారని విమర్శించారు. 90 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్ పోలింగ్ స్టేషన్లలో తన ఓటును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత కోడ్ ఉల్లంఘించి బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ కోరారు.