
– ఓటింగ్ సరళిపై అభ్యర్థుల మల్లగుల్లాలు
– అయా పార్టీల శ్రేణుల్లో నెలకొన్న ఉత్కంఠ
నవతెలంగాణ-బెజ్జంకి
మానకొండూర్ శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విజయం వరించేదెవరినోననే ఉత్కంఠ అభ్యర్థుల్లో,అయా పార్టీల శ్రేణుల్లో నెలకొంది.ఇక్కడి నుండి 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఏర్పుల రసమయి బాలకిషన్,కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో నువ్వా.. నేనా అనే తీరులో పోటీపడ్డారు.నియోజకవర్గంలోని శంకరపట్నం, మానకొండూర్, తిమ్మాపూ ర్, బెజ్జంకి, గన్నేరువరం, ఇల్లంతకుంట మండలాల్లోని గ్రామ గ్రామాన జరిగిన ఎన్నికల సరళిపై ఆయా పార్టీల అభ్యర్థులు,అయా పార్టీల శ్రేణులు,ముఖ్యులతో మల్లగుల్లాలు పడుతూ గెలుపు అవకాశాలపై భేరీజు వేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఆరు మండలాల్లోని గ్రామాల్లో ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపారనే అంశంపై చర్చను చేపట్టిన అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్యనేతలు,పార్టీ శ్రేణులు ఏ గ్రామంలో ఏ మేరకు తమ పార్టీలకు, తమకు ఓట్లు వేశారనే అంశంపై ఆరా తీశారు.ఏ చోట ఇద్దరు వ్యక్తులు కలిసినా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో.. ఎవరు గెలుస్తారోననే చర్చే మండలంలో కొనసాగుతుంది. మండలాలు, గ్రామాల వారిగా తమకు ఎన్ని ఓట్లు వస్తాయి.. ఏ గ్రామంలో ఎంత మెజార్టీ వస్తుందంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల అభ్యర్థులు లెక్కలు వేస్తూ అనుచరులతో చర్చలు చేపట్టారు. గెలుపు మనదేనంటూ ఆయా పార్టీల అభ్యర్థులు దీమాను వ్యక్తం చేస్తూ విజయావకాశాలపై చర్చలు కొనసాగించారు. అభ్యర్థులు ఎవరి దీమాలో వారే ఉండగా, విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.
నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
మానకొండూర్ నియోజకవర్గంలో పోటీ పడిన అభ్యర్థుల భవితవ్యం నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర కళాశాలలో చేపట్టే ఎన్నికల లెక్కింపులో తేలనుంది.ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం, ఫలితాలు సాయంత్రం 5గంటలలోపు తెలిసే అవకాశాలు ఉన్నాయని సమచారం. అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు దీమాలో ఉండగా, ఆయా పార్టీల అభ్యర్థుల అనుచరులు మీరే గెలుస్తారంటూ మనో ధైర్యాన్ని కల్పిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఆరు మండలాల్లోని ముఖ్యులు, అనుచరులతో గెలుపు, మెజార్జీ అంశాలపై లెక్కలు వేస్తూ చర్చించారు.
ఎన్నికల లెక్కింపుపై అభ్యర్థుల సూచనలు..
ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపుపై కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్కరు నిఘా పెట్టాలంటూ ఆయా పార్టీల శ్రేణులకు అభ్యర్థులు సూచించారు. మండలాలు, గ్రామాల్లోని ఈవీఎంలను ఓపెన్ చేసి లెక్కింపు చేసే ఓట్లను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ లెక్క తప్పకుండా చూడాల్సిన బాధ్యత మీదేనంటూ తమ తమ అనుచరులకు అభ్యర్థులు సూచిచినట్టు సమాచారం.విధిగా ఎన్నికల లెక్కింపు కేంద్రాలకు పాస్ లను తెచ్చుకోవాలని, సమయానికి కేంద్రాలకు చేరాలంటూ అయా పార్టీల శ్రేణులకు తెలిపారు.
ఎన్నికల లెక్కింపునకు 14 టేబుల్లు ఏర్పాటు..
ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల లెక్కింపునకు 14 టేబుల్లు, పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల లెక్కింపునకు ప్రత్యేకంగా 2 టేబుల్లను ఏర్పాటు చేసి 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.