ఢిల్లీకి నీళ్ల లొల్లి

Unceasing panchayat– ఏపి, తెలంగాణ అధికారులతో కేంద్ర జలశక్తి అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌
– గంట పాటు జరిగిన సమావేశం
– 6న మరోసారి భేటీ
–  అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు పూర్తి సంయమనం పాటించాలి : దేబశ్రీ ముఖర్జీ
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య జరిగిన నీళ్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. కృష్ణా జలాల పంచాయితీపై ఏపీ, తెలంగాణ అధికారులతో శనివారం ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో ఉన్నతాధికారులు వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఉద్రిక్తతల తగ్గింపు. నాగార్జునసాగర్‌ డ్యాం, శ్రీశైలం డ్యాం నిర్వహణ బదిలీ అంశంపై చర్చ, కృష్ణా రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన అంశాలు మొదలైనవి ఎజెండాగా సమావేశం జరిగింది. దాదాపు గంట పాటు జరిగిన ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అయితే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమావేశానికి హాజరు కాలేననీ, ఈ నెల 5కు సమావేశాన్ని మార్చాలని కోరారు. అందువల్ల ఇరు రాష్ట్రాల అధికారులతో ఈనెల 6న వీడియో సమావేశం నిర్వహించి అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కార్యదర్శి ముఖర్జీ అన్నారు. అప్పటి వరకూ ఇరు రాష్ట్రాలు పూర్తి సంయవనం పాటించాలని సూచించారు. అదే విధంగా నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై ఈ నెల 4న (సోమవారం) కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని కెఆర్‌ఎంబి చైర్మన్‌ శివనందన్‌కు జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సూచించారు.
విజయవాడ సిఎస్‌ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌. జవహర్‌ రెడ్డి మాట్లాడుతూ నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణా వ్యవహరించడం, రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీరు విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు.