ఈటల రెండు చోట్లా ఓటమి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ జాతీయ నాయకత్వం తమ పార్టీ తురుపు ముక్కగా భావించిన ఈటల రాజేందర్‌ రెండు చోట్లా పరాజయం పాలయ్యారు. తెలంగాణలోనూ బెంగాల్‌లో మమతాబెనర్జీపై సువేంద్‌ సర్కారును ప్రయోగించిన తరహాలోనే గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్‌ను బీజేపీ బరిలోకి దింపింది. దీంతో పాటు హుజురాబాద్‌లోనూ ఆయన పోటీచేశారు. కానీ, రెండు చోట్లా ఆయన ఓటమిపాలయ్యారు. గజ్వేల్‌లో సీఎం చేతిలో ఘోర పరాభవం పాలయ్యారు. 45 వేల పైచిలుకు ఓట్లతో ఓటమి చవిచూశారు. హుజూరాబాద్‌లో 16873 ఓట్లతో పాడి కౌశిక్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. హుజురాబాద్‌లో బీజేపీ పాత శ్రేణులు ఆయనకు పూర్తిగా సహకరించకపోవడం, తాను ఓడిపోతే శవయాత్ర చూడాల్సి వస్తుందని కౌశిక్‌చేసిన భావోద్వేగ ప్రకటన ఈటల ఓటమికి కారణమయ్యాయనే చర్చ నడుస్తున్నది. ఈటల రాజేందర్‌ గజ్వేల్‌పై ఎక్కువ కేంద్రీకరించారు. హుజురాబాద్‌లో ఆయన భార్య జమున అంతా తానై చూసుకున్నారు. ఇద్దరు తలో నియోజకవర్గంలో అంతా తామై పనిచేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈటల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ను వీడి ఆ పార్టీనీ, ఇటు తన రాజకీయ జీవితాన్ని ఆగం చేసుకున్నారనే చర్చ నడుస్తున్నది.