– తగ్గిన హరీశ్‌రావు మెజారిటీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బొల్తా పడి అధికార పార్టీకి నిరాశ ఎదురైంది. ప్రత్యర్థి కాంగ్రెస్‌కు గెలుపు దక్కింది. కాంగ్రెస్ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నది. గత ఎన్నికల్లో 88 నియోజకవర్గాల్లో విజయంసాధించిన బీఆర్‌ఎస్ ఈసారీ 39 స్థానాలకే పరిమితమైంది. సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులకూ పరాభవం తప్పలేదు. కొందరు మంత్రులు విజయం సాధించినా, గతంలోని మెజారిటీ మాత్రం దక్కకపోవవడం గమనార్హం. తాజా ఎన్నికల్లో గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నియోజకవర్గం కేసీఆర్ పోటీచేశారు. గజ్వేల్‌లో మరోసారి గెలవగా, కామారెడ్డిలో రెండోస్థానానికి పరిమితమయ్యారు. కేసీఆర్‌ను పక్కనబెడితే మొత్తం 17 మంది మంత్రులకు టికెట్లు దక్కాయి. ఈసారి ఎన్నికల్లో ఆరుగురు మంత్రులకు షాక్ తగిలింది. నిర్మల్ నుంచి బరిలోకి దిగిన ఇంద్రకరణ్‌రెడ్డి, ధర్మపురి నుంచి నిలబడ్డ కొప్పుల ఈశ్వర్, పాలకుర్తి నుంచి పోటీచేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, వనపర్తి నుంచి రంగంలో ఉన్న సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఖమ్మం నుంచి పువ్వాడ అజరుకు మార్, మహబూబ్‌నగర్ వి. శ్రీనివాస్‌గౌడ్ ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో 441 ఓట్లతో గట్టెక్కిన కొప్పుల ఈశ్వర్, ఈసారి మాత్రం ఓటమిని తప్పించుకోలేకపోయారని బీఆర్‌ఎస్ శ్రేణులు వ్యాఖ్యానించడం గమనార్హం.
2018 శాసనసభ ఎన్నికల్లో 53 వేల ఓట్లతో విజయం సాదించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈసారి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అలాగే 51 వేల ఓట్లతో గెలిచిన నిరంజన్‌రెడ్డి, ఈమారు కాంగ్రెస్ అభ్యర్థి టి మేఘారెడ్డి చేతిలో, ఇంతకుముందు 57 వేల ఓట్లతో విజయం సాధించిన శ్రీనివాస్‌గౌడ్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిపై ఓడిపోయారు. ఇంతకుముందు మంత్రులుగా పనిచేసిన వారిలో కేటీఆర్, టి. హరీశ్‌రావు, తలసాని శ్రీనివాసయాదవ్, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పి సబితారెడ్డి, గంగుల కమలాకర్ మరోసారి గెలుపొందారు. తలసాని, సబిత మెజారిటీలు గతం కంటే మెరుగయ్యాయి. సబితారెడ్డికి గతంలో తొమ్మిది వేల ఓట్ల మెజారిటీ రాగా, ఇప్పుడు 26 వేలకు పెరిగింది. తలసానికి గతంలో 30 వేల ఆధిక్యం రాగా, ఇప్పుడు 41 వేలతో విజయం సాధించారు. సిద్ధి పేట నుంచి పోటీచేసిన మంత్రి హరీశ్‌రావు మరోసారి సత్తా చాటారు. 2018లో ఆయనకు 1.18 లక్షల ఓట్ల మెజారిటీ రాగా, ఇప్పుడు 82 వేలకు తగ్గింది. సిరిసిల్ల నుంచి బరిలో ఉన్న కేటీఆర్‌కు గతంలో 89 వేలు రాగా, ఇప్పుడు 30 వేల మెజారిటీ మాత్రమే వచ్చింది. మేడ్చల్ మల్లారెడ్డికి గతంలో 89 వేలు రాగా, ఇప్పుడు 33 వేలు మాత్రమే దక్కింది. గంగుల కమలాకర్ ఇంతకుముందు 14వేల ఓట్ల మెజారిటీకి గాను, ఇప్పుడు కేవలం 300 ఓట్లతో బండి సంజరుపై గెలుపొందారు. మిగతా మంత్రులకు సాధారణ మెజారిటీలు వచ్చాయి.