– 26,214 ఓట్ల మెజార్టీతో జలగంపై గెలుపు
– మొదటి రౌండ్ నుంచి ఆధిక్యత కొనసాగింపు
– అహంకారపూరిత పాలనకు చరమగీతం: సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏకైక జనరల్ సీటు నియోజకవర్గమైన కొత్తగూడెంలో కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు ఘన విజయం సాధించారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జలగం వెంకటరావుపై 26,214 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అధికార పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆదివారం పాల్వంచలోని అణుబాస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల ఓట్ల లెక్కింపు భారీ బందోబస్తు నడుమ జరిగింది. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ ఓట్లతో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సాయంత్రం నాలుగున్నర గంటల వరకు కొనసాగింది. ఫలితాలను ఊరించడంలో అధికారులు కొంత జాప్యం చేశారు. కూనంనేని సాంబశివరావుకు 79,155 ఓట్లు రాగా జలగం వెంకట్రావుకు 52,971, వెంకటేశ్వరరావుకు 37,226 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపును జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక, కమల్ కిషోర్ పర్యవేక్షించారు. ఓట్ల లెక్కింపు 14 టేబుల్ ద్వారా 19 రౌండ్లలో జరిగింది. కొత్తగూడెం నియోజకవర్గంలో మొత్తం 2,43,846 ఓట్లు ఉండగా 1,86,347 ఓట్లు పోలయ్యాయి. 76.56శాతం పోలింగ్ జరిగింది
నియంత పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారు : కూనంనేని సాంబశివరావు
రాష్ట్రంలో నియంత పాలనకు ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్పారని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి గెలిచిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు చెప్పారు. గెలిచిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యమ పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పదేండ్లుగా ఉద్యమాలను అణిచివేసి నియంత పాలన కొనసాగించారన్నారు. అణచివేత ధోరణిని క్షమించరని తెలిపారు. అందుకు నిదర్శనం శాసనసభ ఎన్నికల ఫలితాలే నిరూపించాయని చెప్పారు. తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మఖ్దూంభవన్‌లో సంబురాలు
కూనంనేని విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సంబురాలు నిర్వహించారు. మిఠాయిలు పంచుకుని బాణాసంచా కాల్చుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి నరసింహ, ఎన్ బాలమల్లేష్, నాయకులు బొమ్మగాని ప్రభాకర్, రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు. నిరంకుశ పాలనపై ప్రజలు గెలిచారని చాడ అన్నారు.