– పురోహితుడు రాజ పున్నయ్య శర్మ
నవతెలంగాణ మిరుదొడ్డి: ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందని పురోహితుడు రాజ పున్నయ్య శర్మ అన్నారు. సోమవారం మిరుదొడ్డి శివారులోని శ్రీ సదానంద ఆశ్రమంలో 40 వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో మిరుదొడ్డి మండలం తో పాటు సిద్దిపేట జిల్లాలోని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సదానంద ఆశ్రమంలో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ధ్వజారోహణం సామూహిక అభిషేకం పుష్పార్చన బిల్వపత్ర పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మిరుదొడ్డి ఆరేపల్లి లక్ష్మీ నగర్ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని పురోహితుడు రాజపునయా శర్మ సూచించారు.