కృష్ణా జలాల వివాదంపై భేటీ వాయిదా

Adjournment of meeting on Krishna water dispute– మిగ్జామ్‌ తీవ్ర తుపాను కారణం
– ఈ నెల 8న సమావేశం : కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంపై ఈ నెల 6న బుధవారం నిర్వహించనున్న కీలక సమావేశాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వాయిదా వేసింది. మిచౌంగ్‌ తీవ్ర తుపాను కారణంగానే ఈ భేటీ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు (కేఆర్‌ఎంబీ) అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా బుధవారం ఈ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుందని తొలుత ప్రకటించారు.
అయితే తెలుగు రాష్ట్రాలను మిచౌంగ్‌ తుపాను కుదిపేస్తుండడంతో అధికార యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో తలమునకలైంది. ఈ పరిస్థితుల్లో సమావేశం నిర్వహించడం సబబు కాదని భావించిన కేంద్ర జలశక్తి వాయిదా నిర్ణయం తీసుకుంది. 8న సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.