– పిఓకె భారతదేశానిదే
– అక్కడ 24 స్థానాల్ని రిజర్వ్ చేశాం :కేంద్ర హోంమంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లులను లోక్సభ ఆమోదించింది. జమ్మూకాశ్మీర్లో 83 అసెంబ్లీ సీట్లు ఉండగా వాటిని 90కి పెంచుతున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. ఎస్సీలకు 7 సీట్లు, ఎస్టీలకు 9 సీట్లు రిజర్వ్ చేయనున్నట్లు తెలిపారు. బిల్లుపై జరిగిన చర్చలో వివిధ పార్టీల ఎంపిలు మాట్లాడారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె) భారతదేశానికి చెందిందేనని అన్నారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కారణంగా జమ్మూకాశ్మీర్ రెండు తప్పుల్ని చవిచూసిందని ఆయన ఆరోపించారు. నెహ్రూ సరైన చర్యలు తీసుకొనివున్నట్లయితే పిఒకె భారత్లో భాగమై ఉండేదన్నారు. ‘రెండు పొరపాట్ల కారణంగా జమ్మూకాశ్మీర్ తీవ్రంగా నష్టపోయింది. మొదటిది.. పాక్తో యుద్ధంలో మన సైన్యం గెలుస్తున్నప్పుడు ‘కాల్పుల విరమణ’ విధించడం. ఆ యుద్ధాన్ని మరో రెండుమూడ్రోజులు కొనసాగించి, ఆ తరువాత కాల్పుల విరమణ పాటించివుంటే పిఒకె దేశంలోనే ఉండేది. రెండోది..మన అంతర్గత సమస్యను ఐక్యరాజ్యసమితి (యుఎన్) దృష్టికి తీసుకెళ్లడం’ అని నెహ్రూ తీరుపై ఆరోపణలు గుప్పించారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాద సంఘటనలు చోటు చేసుకోకుండా చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని, 2026 నాటికల్లా ఆ విషయంలో విజయం సాధిస్తామని చెప్పారు. ఇంతకుముందు కాశ్మీర్ డివిజన్లో 46, జమ్మూ డివిజన్లో 37 స్థానాలు ఉండేవి.. తాజా బిల్లులో కాశ్మీర్లో 47, జమ్మూలో 43కు అసెంబ్లీ స్థానాల్ని పెంచినట్టు అమిత్ షా వెల్లడించారు. పిఒకెను కూడా దేశ భూభాగంగా పరిగణించి అక్కడ 24 స్థానాల్ని రిజర్వ్ చేసినట్లు మంత్రి ప్రకటించారు. అయితే కేంద్ర హోంమంత్రి రాజకీయ ప్రసంగం చేయడం, నెహ్రూపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.