– వేగంగా పావులు కదపాలి..
– యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి
– మిత్రపక్షాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలి
– అప్పుడే విజయం
– రాజకీయ పరిశీలకుల మనోగతం
న్యూఢిల్లీ : ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా పరాజయం పాలైంది. ఈ లోటును తెలంగాణలో సాధించిన విజయం ఎంతమాత్రం పూడ్చలేదు. ఓ విధంగా చూస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి, బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలని ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు మింగుడు పడనివే. బీజేపీ యేతర శక్తులు, పార్టీలు ఈ పరాజయ భారం నుంచి కోలుకొని రాబోయే లోక్సభ ఎన్నికలకు ఎంత త్వరగా సన్నద్ధమవుతాయన్నదే ఇప్పుడు ప్రశ్న. సహజంగా ఇందులో కాంగ్రెస్ బాధ్యతే ఎక్కువగా ఉంటుంది. శాసనసభ ఎన్నికల్లో కొంపముంచిన అంతర్గత కుమ్ములాటలకు స్వస్తి చెప్పని పక్షంలో భాగస్వామ్య పక్షాలు, ప్రజల్లో విశ్వాసం నెలకొల్పడం చాలా కష్టమని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. హిందీ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్, ప్రియాంక సుడిగాలి పర్యటనలు చేసినప్పటికీ ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. మధ్యప్రదేశ్లో బీజేపీ హవా కొనసాగింది. రాహుల్, ప్రియాంక ఆధిపత్యం మాత్రమే కొనసాగితే అది ఆరోగ్యకరమైన, వాంఛనీయమైన పరిణామం కాదు. తాము ఎంతగా కష్టపడుతున్నా ప్రయోజనం కలగడం లేదన్న వాస్తవాన్ని వారిద్దరూ గుర్తించాల్సిన తరుణం ఆసన్నమైంది. కమల్నాథ్, దిగ్విజరు సింగ్, అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్ వంటి అలసిపోయిన నేతల స్థానంలో యువ నాయకులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ప్రయోజనం కలుగుతుంది. తెలంగాణలో ఈ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఉంది. ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు కాంగ్రెస్ సముచిత స్థానాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. తొలి అడుగుగా ఇండియా కూటమి కన్వీనర్ పదవిని శరద్ పవార్కో, నితీష్ కుమార్కో అప్పగించడం మంచిది. బీజేపీ యేతర కూటమికి సోనియా గాంధీ ఛైర్పర్సన్గా కొనసాగాలన్న అభిప్రాయానికి ఇప్పుడు ఎంతమాత్రం ప్రాధాన్యత లేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఉత్తరప్రదేశ్ కీలకమవుతుంది. ఆ రాష్ట్రం ప్రియాంక గాంధీ రాజ్యం కాదనే విషయాన్ని కాంగ్రెస్ అంగీకరించాల్సి ఉంది. ఒకప్పుడు గాంధీ కుటుంబ వారసత్వాన్ని, త్యాగాలను యూపీ గుర్తించింది. కానీ ఇప్పుడు అది పాత పురాణం. ఆ విషయాన్ని ప్రియాంక గుర్తించాల్సిన అవసరం ఉంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీతోనో, బీఎస్పీతోనో అవగాహన కుదుర్చుకోవడం మంచిది. రాష్ట్రంలో ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటు కుదుర్చుకుంటే కాంగ్రెస్కు రెండు స్థానాలు మాత్రమే వస్తాయి. ప్రస్తుతం అక్కడ ఆ పార్టీ బలం అంతే.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటుబ్యాంకు చెక్కుచెదరకపోవడం కొంత ఊరట కలిగించే అంశం. రాబోయే లోక్సభ ఎన్నికలలో బీజేపీని మట్టి కరిపించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఆ పార్టీకి ఉందని ‘ది ట్రిబ్యూన్’ పత్రిక మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ హరీష్ ఖారే తెలిపారు.