– త్వరలోనే మరికొందరు ఐపీఎస్‌ల బదిలీలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్ర పోలీసు శాఖలో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అదనపు డీజీ శివధర్‌రెడ్డిని నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వెంటనే శివధర్‌రెడ్డిని ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించుకుంటూ ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర రైల్వే పోలీసు, రోడ్ సేఫ్టీ విభాగానికి అదనపు డీజీగా శివధర్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలను శివధర్‌రెడ్డి స్వీకరించారు. 1994 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్‌రెడ్డి.. నగర సౌత్ జోన్ డీసీపీగా, నల్గొండ ఎస్పీగా, శ్రీకాకుళం ఎస్పీగా, యాంటీ నక్సలైట్ నిఘా విభాగం (ఎస్‌ఐబీ) డీఐజీగా, వైజాగ్ కమిషనర్‌గా పని చేసిన ఆయన సమర్థుడైన ఐపీఎస్ అధికారిగా పేరు పొందారు. ముఖ్యంగా, తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్ ఆయనను తన ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కీలకమైన బాధ్యతలను అప్పగించారు. కాగా, రెండున్నరేండ్లకే శివధర్‌రెడ్డిని హఠాత్తుగా పదవి నుంచి నుంచి తప్పించిన కేసీఆర్.. లూప్‌లైన్‌లోకి మార్చారు. తాజాగా, రేవంత్‌రెడ్డి.. శివధర్‌రెడ్డి సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆయనకు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పోస్టింగ్ ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించటంతో పాటు రాజకీయ ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు పసిగట్టి ముఖ్యమంత్రికి రెండు కండ్లుగా ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యవహరిస్తారనే భావన పోలీసు శాఖలో ఉన్నది. దీంతోపాటు త్వరలోనే ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లతో పాటు మరికొన్ని కీలకమైన పోలీసు విభాగాల అధిపతులను ముఖ్యమంత్రి బదిలీ చేసే అవకాశమున్నదనే ఊహాగానాలు పోలీసు శాఖలో సాగుతున్నాయి.