సఫారీ సవాల్‌

సఫారీ సవాల్‌– కుర్రాళ్లను ప్రయోగిస్తున్న భారత్‌
– దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌
– పొట్టి ప్రపంచకప్‌ సన్నాహకం
ఆధునిక క్రికెట్‌ అగ్ర జట్లలో టీమ్‌ ఇండియా ఒకటి. టెస్టు, వన్డే ఫార్మాట్లలో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే జట్లు తక్కువే. కానీ టీ20 ఫార్మాట్‌లో పరిస్థితి విభిన్నం. టీమ్‌ ఇండియా బలహీనంగా కనిపించే ఫార్మాట్లలో టీ20 ముందుంటుంది. మరో ఆరు నెలలో 2024 టీ20 ప్రపంచకప్‌ వేట షురూ కానుండగా.. భారత్‌ యువ సేనను సిద్ధం చేసే పనిలో నిమగమైంది. సొంతగడ్డపై ఆసీస్‌ను చిత్తు చేసి ఇప్పుడు సఫారీ సవాల్‌కు సిద్ధమైంది. ఆదివారం నుంచి భారత్‌, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ ఆరంభం.
నవతెలంగాణ క్రీడావిభాగం
కఠిన పరీక్ష
2023 ఐసీసీ ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ, రాహుల్‌ ద్రవిడ్‌ వంద శాతం ప్రదర్శన కనబరిచారు. వరుసగా పదికి పది మ్యాచుల్లో విజయాలతో అద్భుతమే చేశారు. ఫైనల్లో గెలిస్తే సరికొత్త చరిత్రే సృష్టించేవారే. ప్రపంచకప్‌ ఓటమి బాధలో ఉన్న ఈ జోడీకి బీసీసీఐ ఊహించని ఆఫర్‌ ఇచ్చింది. ద్రవిడ్‌ అండ్‌ కో కాంట్రాక్టు పొడగించగా.. 2024 టీ20 ప్రపంచకప్‌ సారథ్య పగ్గాలు అందుకోమని రోహిత్‌ను కోరింది. ఇటు ద్రవిడ్‌, అటు రోహిత్‌లు ఇప్పటివరకు ప్రపంచకప్‌ విజయం ఎరుగరు. కోచ్‌గా ఆ ఘనత కొట్టాలని ద్రవిడ్‌.. ఆటగాడిగా ఆ కప్పు అందు కోవాలనే రోహిత్‌ పట్టుదలగా కనిపిస్తున్నారు. టీ20 డ్రెస్సింగ్‌రూమ్‌ వాతావరణం మార్చటం ఇప్పటికిప్పుడు ఈ జోడీకి కష్ట సాధ్యమే. అయినా.. 2024 టీ20 ప్రపంచకప్‌ వేటకు ద్రవిడ్‌, రోహిత్‌ సిద్ధమయ్యారు. ఈసారి గురి తప్పితే వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కొవాల్సిన ప్రమాదం పొంచి ఉందనే విషయం ద్రవిడ్‌, రోహిత్‌లకు బాగా తెలుసు. మరి ఈ కఠిన పరీక్షను ఈ జోడీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహిస్తు న్నారు. స్వదేశంలో అఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌కు రోహిత్‌ పగ్గాలు అందుకునే అవకాశం ఉంది.
దంచికొట్టేవాళ్లే కావాలి
టీ20 ఫార్మాట్‌లో అగ్ర జట్టు, పసికూన అంటూ పెద్దగా వ్యత్యాసం ఉండదు. జోరు సాగితే ప్రపంచ చాంపియన్‌ సైతం పసికూన ముంగిట తలొంచాల్సిందే. అతి వేగంగా సమీకరణాలు మారే ఈ ఫార్మాట్‌లో అంతే వేగంగా ధనాధన్‌ జోరు చూపించే ఆటగాళ్లు అవసరం. యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ అందుకు చక్కటి ఉదహరణ. క్రీజులోకి వచ్చి ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ఎదురుదాడి చేస్తూ బౌండరీలు సాధిస్తున్న జితేశ్‌ విమర్శకుల మెప్పు పొందాడు. అటువంటి ఆటగాళ్లు మిడిల్‌ ఆర్డర్‌లో భారత్‌కు అత్యవసరం. సూర్యకుమార్‌ యాదవ్‌, జితేశ్‌ శర్మ, రింకూ సింగ్‌లకు మరో ఇద్దరు తోడైతే భారత్‌కు ఎదురుండదు. అయితే, భారత జట్టులో ఓ సంస్థాగత సమస్య నెలకొంది. సీనియర్‌ ఆటగాడు జట్టులోకి రాగానే అప్పటి వరకు మెరుగ్గా రాణిస్తున్న కుర్ర క్రికెటర్‌ను బెంచ్‌కు పరిమితం చేస్తారు. సన్నాహక మ్యాచుల్లో కుర్రాళ్లు ఆడితే.. అసలు టోర్నీలకు సీనియర్లు దర్శనం ఇస్తారు. ఇక్కడే టీమ్‌ ఇండియా ప్రణాళిక పట్టాలు తప్పుతోంది. సీనియారిటీ, పాపులారిటీ కాకుండా.. దంచికొట్టగలడా? లేదా అనేది మాత్రమే చూడాలి. ఎందుకంటే ఈ ఫార్మాట్‌లో ఫామ్‌, సగటు.. అంటూ గణాంకాలు పెద్ద లెక్క కాదు. ఎంత తక్కువ బంతుల్లో ఎన్ని ఎక్కువ పరుగులు చేశామనేది కీలకం.
మిడిల్‌ లెక్క తేలాలి
టీ20 ప్రపంచకప్‌కు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ రానున్నాడు. వరల్డ్‌కప్‌లో అతడి జోరు చూశాక.. ఈ ఫార్మాట్‌లో సరిపోతాడని అందరూ అనుకున్నారు. రోహిత్‌ రాకతో మరో ఓపెనర్‌ బెర్త్‌ కోసం తీవ్ర పోటీ కనిపిస్తుంది. యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్‌ రేసులో ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరు వేగంగా పరుగులు చేస్తారో వారికే అవకాశం దక్కవచ్చు. ఇక నం.3 బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లికి అవకాశం ఇస్తారా? జట్టు అవసరాల దృష్ట్యా ధనాధన్‌ బ్యాటర్‌ను దింపుతారా? అనేది తేలాలి. శ్రేయస్‌ అయ్యర్‌, తిలక్‌ వర్మలు ఈ స్థానం కోసం పోటీపడుతున్నారు. విరాట్‌ కోహ్లి వస్తే సహజంగానే అతడికే మొగ్గు ఉంటుంది. కానీ ఆచితూచి ఆడుతూ పరుగులు చేయటం వలన ప్రయోజనం ఉండదు. జట్టు అవసరాల మేరకు ఆడేందుకు విరాట్‌ అంగీకరిస్తాడా? చూడాలి.
అదో అనుకూలత!
డర్బన్‌ టీ20లో సఫారీ సవాల్‌ మొదలవనుంది. దక్షిణాఫ్రికా జట్టులో నాణ్యమైన సీమర్లు ఉన్నారు. దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో మన పేసర్లు సైతం రాణించగలరు. 2024 టీ20 ప్రపంచకప్‌ అమెరికా, వెస్టిండీస్‌లో జరుగనుంది. కరీబియన్‌ దీవులను మినహాయిస్తే.. అమెరికా పిచ్‌లు, పరిస్థితులు అందరికీ కొత్తే. ఈ ఫార్మాట్‌లో కాస్త వెనుకంజలో నిలిచిన భారత్‌కు ఇది పెద్ద సానుకూలత. గతంలో వెస్టిండీస్‌తో కొన్ని టీ20 మ్యాచులు అమెరికాలో ఆడిన అనుభవం భారత్‌ సొంతం. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా.. మంచి కుర్ర జట్టును సిద్ధం చేయగలిగితే భారత్‌ పొట్టి ప్రపంచకప్‌ వేటలో ఓ అడుగు ముందుకేసినట్టు అవుతుంది. సఫారీతో సిరీస్‌లో సూర్య సారథ్యంలో ప్రయోగించిన కుర్ర జట్టు విజయవంతమైతే.. ఆ కుర్రాళ్లకు ప్రపంచకప్‌ జట్టులోనూ చోటు కల్పించాలి. లేదంటే, గతంలో ఎన్నో సార్లు చూసిన ఫలితాలనే మళ్లీ చూడక తప్పదు.