ప్రతిరోజూ 42 మంది ఆత్మహత్య

ప్రతిరోజూ 42 మంది ఆత్మహత్య– గంటకు ఇద్దరు చొప్పున సూసైడ్‌
– బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో దారుణాలు..
.ఎన్సీఆర్బీ బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఆత్మహత్యలు ఆగడంలేదు. ప్రతిరోజూ 42 మంది తమ ప్రాణాలను బలిపెట్టుకుంటున్నారని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) తెలిపింది. గంటకు ఇద్దరు చొప్పున సూసైడ్‌ చేసుకుంటున్నారు. ఎన్సీఆర్బీ 2022 డేటా ప్రకారం దేశవ్యాప్తంగా జరిగిన 1,70,924 ఆత్మహత్యల్లో మధ్యప్రదేశ్‌లోనే 15,386 ఆత్మహత్యలు జరిగాయి. జాతీయ సగటు రోజుకు 468 మంది ఆత్మహత్యలు చేసుకుంటే, మధ్యప్రదేశ్‌లో మాత్రం ప్రతిరోజూ 42 మంది, దాదాపు గంటకు ఇద్దరు తమ జీవితాలను అర్థంతరంగా ముగింపుపలుకుతున్నారు.

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మరో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న మహారాష్ట్రలో 22,746 ఆత్మహత్యలు (మొత్తం లెక్కలో 13.3 శాతం), తమిళనాడులో 19,834 (11.6 శాతం), మధ్యప్రదేశ్‌లో (9 శాతం), 15,386 మంది, కర్నాటకలో 13,606 (8 శాతం), పశ్చిమ బెంగాల్‌లో 12,669 (7.4 శాతం) ఉన్నాయని ఎన్సీఆర్బీ డేటా వెల్లడించింది. మొత్తం ఆత్మహత్యల్లో ఈ రాష్ట్రాలు 49.3 శాతం ఉండగా, మిగిలినవి మిగిలిన 23 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నాయి.
దేశంలో తమ జీవితాలను ముగించుకున్న 38,259 మంది పురుషులు, 20,828 మంది మహిళలతో కూడిన 59,087 మంది 18-30 ఏండ్ల మధ్య ఉన్నారని, 31.7 శాతం మంది కుటుంబ సమస్యల కారణంగా, 18.4 శాతం మంది అనారోగ్యం కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపింది.
గతేడాది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 746 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. భోపాల్‌లో 527 మంది, గ్వాలియర్‌లో 307 మంది, జబల్‌పూర్‌లో 213 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.కుటుంబ సమస్యల కారణంగానే 31.7 శాతం ఆత్మహత్యలు జరిగాయని భోపాల్‌ పోలీస్‌ కమిషనర్‌ హెచ్‌సి మిశ్రా తెలిపారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలహీనపడటం, భావోద్వేగ బంధం, కమ్యూనికేషన్‌ లేకపోవడం దీనికి ప్రధాన కారణమని అన్నారు. యువకులు, ముఖ్యంగా విద్యార్థులు సరైన కౌన్సిలింగ్‌ లేకపోవడంతో పాటు సమాజంలో కమ్యూనికేషన్‌ లేకపోవడం వల్ల తమ జీవితాలను ముగించుకుంటున్నారని గతంలో ఇండోర్‌ కమిషనర్‌గా, జబల్‌పూర్‌, గ్వాలియర్‌ ఎస్‌పిగా పనిచేసిన మిశ్రా అన్నారు.