పాలనపై రేవంత్‌ దృష్టి

Revanth's focus on governance– వచ్చిరాగానే హామీల అమలు షురూ
–  ఏఐఎస్‌ల్లో భారీ మార్పులు
– కొప్పుల రాజు మార్క్‌ నియామకాలు !
– సీఎంవోకి కొత్త నీరు
– సీఎస్‌ శాంతికుమారి కొనసాగింపు ?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అప్పుడే పరిపాలనపై దృష్టిసారించారు. వచ్చిరాగానే మ్యానిఫెస్టో లోని ప్రధాన అంశాల అమలుకు శ్రీకారం చుట్టారు. ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే చకచకా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో ప్రజలకు సోనియా,రాహుల్‌, ప్రియాంకలు చెప్పినవే కాకుండా, తెలంగాణ నేపథ్యంలో తాను అనుకున్న పనులను త్వరితగతిన చేపట్టేందుకు ముందస్తు ప్రణాళికతోనే ఉన్నట్టు కనిపిస్తున్నది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా మారుస్తూ ఆదేశాలు ఇచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా ఉద్యమకారులపై నమోదైన పోలీసు కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు సైతం జారీచేశారు. శనివారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. అలాగే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేసేలా చేపట్టిన చర్యలపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రగతిభవన్‌ పేరు జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌గా మార్చేశారు. ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ‘ప్రజాధర్భార్‌’ను ప్రారంభించారు. ఇలా పలు అంశాలపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుపోతున్నారు. ఆర్టీసీ, విద్యుత్‌ శాఖలపై గట్టిగానే సమాలోచనలు చేసి, చక్కదిద్దాలనే భావనలో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు రాగానే విద్యుత్‌రంగంపై సమీక్షలు చేసి అవినీతికి బాధ్యులైన అధికారులపై కఠినంగా వ్యవహరించేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. అధికారంలోకి రావడం ఒక ఎత్తయితే, ఆతర్వాత పరిపాలనను ప్రజల దగ్గరకు తీసికెళ్లడం మరో ఎత్తు. ఇందుకోసం అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ తదితర అధికారులను సరైన స్థానాల్లో నియమించాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా అధికారుల నియామకం చేసుకోవాల్సి రావచ్చు.
సీఎంవోకు కొత్తనీరు
ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శాంతికుమారిని కొనసాగిస్తారా ? లేదా ? అనేది కొద్దిరోజుల్లో తేలనుంది. అయితే ఆమె సర్వీసు ఒక సంవత్సరం మాత్రమే మిగిలి ఉండటంతో, ఆమెనే కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఆతర్వాత సీఎంఓ కీలకం. అక్కడ ముఖ్యకార్యదర్శిగా ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసిన వచ్చి, సీఎంవో కార్యదర్శిగా ఉన్న ఐఎఎస్‌ అధికారి వి.శేషాద్రిని నియమించినట్టుగా వార్తలొచ్చాయి. కాగా జీవో విడుదల కాలేదు. ఇకపోతే ముఖ్యమంత్రి కార్యాలయంలోని ప్రస్తుత అధికారులను పూర్తిగా పక్కబెడతారనే ప్రచారం జరుగుతున్నది. సీఎం కార్యదర్శిగా స్మీతసభర్వాల్‌ ఇప్పటిదాకా సీఎం రేవంత్‌రెడ్డిని కలవలేదు. కనీసం శుభాకాంక్షలు చెప్పడానికి సైతం రాలేదు. ఆమెకు అక్కడ పనిచేయడం ఇష్టం లేదనే గుసగుసలు ఐఏఎస్‌ల్లో వినిపిస్తున్నాయి. ఇంకా మరికొందరిని ఇతర శాఖలకు బదిలీ చేసి కొత్త నీరును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారం, పది రోజుల్లో ఈ నియామాకలపై దృష్టిసారించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. పరిపాలన చేయాలంటే తొలుత సీఎంవోను సంస్కరించాల్సి ఉంటుంది. వారి సహకారంతో ఆయా ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల నియామకాలు జరగనున్నాయి. సీఎంవోలోకి కొత్తగా రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, జలమండలి ఎండీ బి.దానకిషోర్‌, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంతోపాటు మరికొందరిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రెండు, మూడు రోజుల్లోనే వీరికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే కేసీఆర్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ తదితరులు రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి రెండురోజులవుతున్నా వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు చెప్పకపోవడం వెనుక వారి అంత్యర్యం అర్థమవుతున్నది. వీరు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న నవీన్‌మిట్టల్‌కు కీలకబాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఐఎఎస్‌ల్లో యువరక్తాన్ని ప్రొత్సహించే ఆలోచన సైతం సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్నట్గు ఆయన అనుచర వర్గాలు చెబుతున్నాయి. నిర్ణయాలు వేగంగా తీసుకోవడమేగాక, అమలు అంతకంటే వేగంగా జరిగేలా పరిపాలనా యంత్రాంగాన్ని తీర్చిదిద్దుకోవాలని రేవంత్‌ భావిస్తున్నట్టు తెలిసింది.
వచ్చే రెండు, మూడు నెలల్లోనే రాష్ట్ర పరిపాలన యంత్రాంగంపై పట్టుసాధించి, ఏడాదిలోగా రాష్ట్రాన్ని అభివృదిపథంలో దూసుకువెళ్లేలా వ్యవహారం నడిపేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకునే దిశగా సీఎం అడుగులు ఉండనున్నాయని సచివాలయ అధికారవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ సూచన మేరకు మాజీ ఐఏఎస్‌ అధికారి కొప్పుల రాజు సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. దేశంలోని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రాజు సేవలను రాహుల్‌ ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందుకుంటున్నట్టు తెలిసింది. అలాగే తెలంగాణలోనూ ఆ మేరకు రాజు సహకారాన్ని రేవంత్‌ తీసుకోవచ్చని సమాచారం.
డీజీపీ ఎవరు ?
పోలీస్‌ డీజీపీని త్వరలో నియమించే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌ సీపీగా పనిచేస్తున్న క్రమంలో ఎన్నికల నేపథ్యంలో బదిలీ అయిన సీవీ ఆనంద్‌ పేరు పరిశీలనలో ఉందని తెలిసింది. రవిగుప్తాను ఎన్నికల కమిషన్‌ తాత్కాలికంగా నియమించినా, ఆయన్ను త్వరలో మార్చనున్నారు. అదనపు డీజీపీ జితేందర్‌ పేరు సైతం డీజీపీగా ప్రచారంలో ఉంది. ఇతర పేర్లూ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా బి. శివధర్‌రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ జరిగి, ఆయా మంత్రులకు శాఖలు కేటాయించాక అధికారుల నియామకాలపై దృష్టిసారిస్తారని సమాచారం. ఆయా శాఖలకు మంత్రులు వచ్చాక, వారి వారి అభిప్రాయాల మేరకు నియామకాలు చేస్తారా ? సొంతంగా తానే నిర్ణయాలు తీసుకుంటారా ? అనేది వేచిచూడాల్సిందే. సాధారణంగా అఖిలభారత సర్వీసు అధికారుల నియామకాలు సీఎం సొంతంగా తీసుకునే సంప్రదాయం కొనసాగుతూ వస్తున్నది. అయితే దీనిని పాటిస్తారో ? లేదో ? కూడా ఆచరణలో తేలనుంది.