– నేడు శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణం
– ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ నియామకం
– దూరంగా ఉంటామన్న బీజేపీ ఎమ్మెల్యేలు
– అనారోగ్య కారణాలతో మాజీ సీఎం కేసీఆర్ కూడా
– మహాలక్ష్మి పథకం ప్రారంభించనున్న సీఎం రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎన్నికల సమరం పరిసమాప్తమై కాంగ్రెస్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ…ఇక సభా సమరం షురూ కానుంది. శనివారం రాష్ట్ర మూడో శాసనసభ సమావేశమవుతోంది. గత పదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన అసెంబ్లీ ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలో తొలిసారిగా భేటీ కానుంది. ముఖ్యమంత్రి హోదాలో ఎనుముల రేవంత్‌రెడ్డి మొదటిసారిగా సభలో అడుగుపెట్టనున్నారు. ఇరుపార్టీల్లో సీనియర్లు, ఎంతో అనుభవం గడించిన నేతలు సభకు హాజరుకానున్నారు. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్, ఆయన తర్వాత అత్యధిక సార్లు ఎన్నికైన హరీశ్‌రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత స్థానాల్లో వరుసగా తలసాని శ్రీనివాసయాదవ్, దానం నాగేందర్ సీనియర్లుగా ఉన్నారు. వీరంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాబట్టి వారిని ప్రొటెం స్పీకర్‌గా నియమించడానికి కొత్త ప్రభుత్వం ఇష్టపడ లేదు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా అత్యధికసార్లు గెలిచిన వారిలో ఉన్నా… వారిద్దరూ మంత్రులుగా ఉండటంతో ప్రొటెం స్పీకర్‌గా నియమించడం సాధ్యం కాదని తెలిసింది. ఈ కారణంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని (వరుసగా ఆరుసార్లు అసెంబ్లీ ఎన్నిక కావడంతో) ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఈమేరకు శనివారం ఉదయం 8.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మరోవైపు నూతన ఎమ్మెల్యేలు శనివారం శానసనసభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొటెం స్పీకర్‌గా అక్బర్ ప్రమాణం చేసిన తర్వాత ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న శాసనసభలో ఆయన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. బాత్రూరలో కాలుజారి కిందపడటం వల్ల ఆయన ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన శాసనసభకు వచ్చే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ వ్యవహరిస్తుండటంతో ఆయన సమక్షంలో ప్రమాణం చేయలేమంటూ బీజేపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. 2018లో కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇదే విధంగా వ్యవహరించారు. ఆ తర్వాత స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆయన ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. శనివారం శాసనసభ వాయిదా అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మహాలక్ష్మి పథకాన్ని (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి నేరుగా నిమ్స్‌కు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా (ఆ పథకానికి ఉన్న ఆర్థిక పరిమితి పెంపు) ప్రారంభించనున్నారు.
అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా శాసనసభ భేటీ కానున్న నేపథ్యంలో శనివారం ఉదయం 7 గంటల తర్వాత ఆయా పరిసరాల్లో ఆంక్షలు ప్రారంభం కానున్నాయి. పబ్లిక్ గార్డెన్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాకింగ్ చేసే ప్రజానీకం ఉదయం 6 గంటల లోపే తమ నడకను ముగించుకోవాలని అసెంబ్లీ కార్యాలయం సూచించింది.