హత్యకు గురైన దళిత మహిళ

హత్యకు గురైన దళిత మహిళ– వల్లందాసు మంజులగా గుర్తింపు
– పోలీసుల అదుపులో నిందితులు!
నవతెలంగాణ- నల్లగొండ కలెక్టరేట్‌
నల్లగొండ జిల్లా కేంద్రంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద దారుణ హత్యకు గురైన దళిత మహిళను వల్లందాసు మంజులగా పోలీసులు గుర్తించారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం వెలుగుపల్లికి చెందిన వల్లందాసు మంజుల జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎల్బీసీ ప్రాంతంలో గల ప్రభుత్వ మెడికల్‌ కళాశాల బార్సు హాస్టల్‌లో వంట మనిషిగా పనిచేస్తోంది. బుధవారం ఉదయం పనికి వెళ్ళిన మంజుల రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఆచూకీ లభ్యం కాలేదు. ఫోన్‌ కూడా మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. ఆమెకు పరిచయం ఉన్న ఒక వ్యక్తిపై కుటుంబీకులకు అనుమానం రాగానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే మార్చురీలో పెట్టిన మృతదేహాన్ని పోలీసులు వివిధ గ్రూపులలో షేర్‌ చేయగా.. ఆమెను మంజులగా భావించి కుటుంబీకులు వెంటనే తిప్పర్తి ఎస్‌ఐకి సమాచారం అందించారు. మార్చురీలో మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు మంజుల హత్యకు గురైందని వాపోయారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడితోపాటు మరో నలుగురి ప్రమేయం ఉన్నట్టు సమాచారం. మంజులకు పరిచయం ఉన్న వ్యక్తితో పాటు అతని స్నేహితులకు హత్యకు సంబంధం ఉన్నట్టు తెలిసింది. అయితే ప్రధాన నిందితుడు గురువారం రాత్రి 12 తర్వాత పోలీసులకు దొరికాడని, మిగతా ముగ్గురిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. మంజుల మృతదేహానికి శుక్రవారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మంజుల తల్లిదండ్రుల గ్రామమైన వెలుగుపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
మంజులను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజాసంఘాల నాయకులు పలువురు మాట్లాడుతూ.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు.