– ఇద్దరిని అరెస్టు చేసిన ఎస్వోటీ పోలీసులు
– 510 కిలోల గంజాయి స్వాధీనం
నవతెలంగాణ- సిటీబ్యూరో
ఒడిషాలో గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి హర్యానాకు తరిలిస్తున్న ఇద్దరిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.8వేలతోపాటు 510కిలోల గంజాయి, ఆటో గూడ్స్వాహనం, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.1,28,50,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు.
జమ్మూకాశ్మీర్‌కు చెందిన మోహన్, హర్యానాకు చెందిన ప్రవీణ్‌కుమార్ స్నేహితులు. ఇద్దరూ కలిసి గంజాయి స్మగ్లింగ్ చేయాలని పథకం వేశారు. ఇందులో భాగంగా ఒడిషాలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేస్తున్న నిందితులు మనోహర్ అనే స్నేహితునితో కలిసి హర్యానాలోని హిస్సార్ ప్రాంతానికి సరఫరా చేస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు రాచకొండ శివారు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా వేశారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆటో ట్రాలీ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో గంజాయి లభ్యమైంది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన విచారించారు. గూడ్స్ట్రాలీలో ప్రత్యేక క్యాబిన్‌ను ఏర్పాటు చేసిన గంజాయిని తరలిస్తున్నారు. ఎస్ఓటీ పోలీసులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో డీసీపీలు డి.జానకి, గిరిధర్, అదనుపు డీసీపీ ఎస్.సూర్యనారాయణ, ఏసీపీ వాసు, ఇన్స్పెక్టర్స్ రాములు, సైదులు, ఎస్ఐ పరమేశ్వర్ తదితరులు ఉన్నారు.