– కాంగ్రెస్ విజయంలో సీపీఐ సంపూర్ణ సహకారం
– భవిష్యత్‌లోనూ కలిసే ముందుకెళ్తాం :మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో సీపీఐ సంపూర్ణ సహకారం అందించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భవిష్యత్‌లో కూడా తాము కలిసే ముందుకెళ్తామని చెప్పారు. విద్యార్థి ఉద్యమాల నుంచి తనకు కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి సంఘాలతో అనుబంధం ఉన్నదని గుర్తు చేశారు. ప్రజా సమస్యలను వింటామనీ, వాటిని పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హమీ ఇచ్చారు. పొన్నం ప్రభాకర్, మాశ్రీకొండూరు ఎమ్మెల్యే కె సత్యనారాయణ శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్మపద్మ, ఎన్ బాలమల్లేష్, కలవేణి శంకర్, బాలనర్సింహా, ఈటి నర్సింహతో సమావేశమయ్యారు. అనంతరం పొన్నం మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలను చెప్పుకునేందుకు, ప్రతిపక్ష నేతలు కలిసేందుకూ అవకాశం లేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చిన వెంటనే ప్రజాసమస్యలను వినేందుకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ హయాంలో కూడబెట్టిన వనరులను, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకు అప్పగించిస్తోందని విమర్శించారు. 1999 సంవత్సరంలో తాను ఎన్‌ఎస్‌యూఐ నాయకునిగా ఉన్న సమయంలో ఏఐఎస్‌ఎఫ్‌తో కలిసి పనిచేశామని గుర్తు చేశారు. అనేక సమస్యలపై కలిసి ఉద్యమించామని వివరించారు. సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ విజయంతో రాష్ట్రంలో ప్రజాస్వామిక పునాది పడిందన్నారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి ముందుకెళ్తాయని చెప్పారు.
ప్రజల ఆశలు వమ్ము చేయొద్దు : కూనంనేని
ప్రజల ఆశలు, ఆశయాలను వమ్ము చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలిచ్చిన అధికారాన్ని కాపాడుకోవాలని కూనంనేని సూచించారు. అసెంబ్లీలో అన్ని కమ్యూనిస్టు పార్టీల తరపున, పీడిత, బాధిత అన్ని వర్గాల ప్రజల పక్షాన తాను నిర్మాణాత్మక పాత్ర పోషిస్తానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత గట్టిగా పోరాడతానని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. వాగ్దానాలను, మ్యానిఫెస్టోలోని అంశాలను అమలు చేయాలని అజీజ్ పాషా అన్నారు. ఇప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టుగా ఉందని చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సురవరం సుధాకర్ రెడ్డిని కలిసిన మంత్రి పొన్నం
శనివారం మఖ్దూంభవన్‌కు వచ్చిన సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని పొన్నం ప్రభాకర్, సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి సురవరం అభినంధనలు తెలిపారు.