– ‘ఈశాన్యం’లో పత్రాలు లేని వలసదారుల సమాచారమివ్వండి :అసోం పౌరసత్వ కేసులో కేంద్రానికి సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో అక్రమ వలసలపై సుప్రీంకోర్టు స్పందించింది. మార్చి 24, 1971 తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు అక్రమంగా వచ్చిన వలసదారుల వివరాలు అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి పరిపాలనా స్థాయిలో తీసుకున్న చర్యల గురించి, ప్రత్యేకించి అసోం గురించి తెలియజేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. అసోం రాష్ట్రానికి పార్లమెంటు ఆమోదంతో పౌరసత్వ చట్టం 1955లో చొప్పించబడిన సెక్షన్ 6ఏకు వ్యతిరేకంగా, మద్దతుగా దాఖలైన పిటిషన్ల సమూహాన్ని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి.
పత్రాలు లేకుండా రాష్ట్రంలోకి ప్రవేశించిన వలసదారుల విషయంలో చట్టంలోని సెక్షన్ 6ఏను.. 1985లో రాష్ట్రంలోని విదేశీయుల వ్యతిరేక ఆందోళన నాయకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ సమస్యను పరిష్కరించడానికి ఒప్పంద పత్రానికి అనుగుణంగా పార్లమెంటు ఆమోదించింది. ఇది అసోం ఒప్పందంగా ప్రసిద్ధి చెందింది. జనవరి 1, 1966 వరకు అసోంలో ప్రవేశించిన విదేశీ వలసదారులు భారతీయ పౌరులుగా మారడానికి ఇది అనుమతిస్తుంది. ఆ తేదీ తర్వాత మార్చి 24, 1971 వరకు ప్రవేశించిన వారిని కూడా వారు నమోదు చేసుకున్నట్టయితే, వారి ఓటు హక్కును పౌరసత్వం కోసం పరిగణించాలనే నిబంధనను జోడించారు. అయితే, పార్లమెంటు ఆమోదించిన ఈ వివాదాస్పద సెక్షన్‌కు అనేక పిటిషన్లు మద్దతుగా ఉండగా, మరికొందరు దేశం మొత్తానికి ఉమ్మడి పౌరసత్వ నియమం ఉండాలనీ, అలాంటి వలసదారులను అసోంలో పౌరులుగా, ఓటర్లుగా మార్చడానికి అనుమతించటాన్ని వ్యతిరేకిస్తున్నారు.