ఘనంగా తండేల్‌ ప్రారంభం

ఘనంగా తండేల్‌ ప్రారంభంనాగ చైతన్య అక్కినేని, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘తండేల్‌’. శనివారం ఈ సినిమా గ్రాండ్‌గా ముహూర్తం వేడుకను జరుపుకుంది. నాగార్జున, వెంకటేష్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.
ముహూర్తం షాట్‌కు నాగార్జున కెమెరా స్విచాన్‌ చేయగా, వెంకటేష్‌ క్లాప్‌ ఇచ్చారు. అల్లు అరవింద్‌ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, ‘మా హీరో, దర్శకుడు ఎప్పుడు షూటింగ్‌ అనే కంగారు లేకుండా, ఈ కథని మనం అనుకున్న స్థాయిలో అద్భుతంగా చూపించాలనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కథని ఒక వరల్డ్‌లోకి తీసుకెళ్ళి చూపించాలి. ఆ వరల్డ్‌ క్రియేట్‌ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. నాగచైతన్యకు సరైన జోడిగా సాయిపల్లవి వచ్చారు’ అని తెలిపారు.
‘ఏడాదిన్నరగా కథపై వర్క్‌ చేశాం. వాసు, అరవింద్‌ అద్భుతంగా ప్రోత్సహించారు. నాగచైతన్య, సాయి పల్లవి, మిగతా టెక్నిషియన్స్‌ అందరూ బెస్ట్‌ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. వాళ్ళంతా నన్ను ఎంతగానో మోటివేట్‌ చేస్తున్నారు’ అని దర్శకుడు చందూ మొండేటి చెప్పారు.
సాయి పల్లవి మాట్లాడుతూ, ‘దర్శకుడు, రచయిత, నిర్మాతలు అందరికీ ఈ సినిమా పట్ల ఒక విజన్‌ ఉంది. ఆ విజన్‌ మీ అందరికీ సరిగ్గా చేరుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘ఇది ప్రతి సినిమాలా కాదు. చాలా ప్రత్యేకమైనదని, బలమైన కథ, కావాల్సిన సమయం తీసుకొని పక్కాగా ప్లాన్‌ చేసుకొని వెళ్దామని అరవింద్‌ ముందు నుంచి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. కథకు కావాల్సిన బడ్జెట్‌, సపోర్ట్‌ ఇస్తున్న ఆయనకు ధన్యవాదాలు. నా కెరీర్‌లో గుర్తుండిపోయే సక్సెస్‌ 100% లవ్‌ అరవిందే ఇచ్చారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆయన నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే వాసుకి ధన్యవాదాలు. చందూ దర్శకుడిగా కంటే నాకు మంచి స్నేహితుడు. తనతో ప్రతి విషయాన్ని ఓపెన్‌గా చర్చించగలుగుతాను. మా ఇద్దరం కలసి చేస్తున్న మూడో సినిమా ఇది. సాయి పల్లవి చాలా పాజిటివ్‌ ఎనర్జీ ఉన్న యాక్టర్‌. తను ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. దేవిశ్రీ ప్రసాద్‌, షామ్‌దత్‌, శ్రీనాగేంద్ర ఇలా అద్భుతమైన టీం ఈ చిత్రానికి పని చేస్తుంది. ఈనెల 15 తర్వాత షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తున్నాం’ అని హీరో నాగ చైతన్య చెప్పారు.
నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, ‘ఇది గీతాఆర్ట్స్‌కి చాలా ప్రత్యేకమైన స్క్రిప్ట్‌. ఇంత రీసెర్చ్‌ ఏ సినిమాకి జరిగి ఉండదు. చందు కథని అద్భుతంగా మలిచారు. ఆయనకి హ్యాట్సప్‌ చెప్పాలి. ఇందులో చైతూది ఫిషర్‌ మ్యాన్‌ క్యారెక్టర్‌. దీనికి చైతు స్కిన్‌ టోన్‌తో పాటు అన్నీ ఎలా కుదురుతాయో అనే ఆలోచన ఉండేది. అయితే ‘తండేల్‌’ ఫస్ట్‌ లుక్‌ చూసి ఆడియన్స్‌తో పాటు నేను షాక్‌ అయ్యాను’ అని అన్నారు.