సోనియాకు మోడీ, స్టాలిన్‌ ప్రభృతుల శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అగ్ర నాయకులు, మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ 77వ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రభృతులు శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీ కూడా చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మోడీ ట్వీట్‌ చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నాయకులు కెసి వేణుగోపాల్‌, శశిథరూర్‌, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన ప్రజల హక్కుల కోసం సోనియా గాంధీ పోరాటం చేస్తున్నారని ఖర్గే పేర్కొన్నారు. సోనియా జీవన ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకమని వేణుగోపాల్‌ కొనియాడారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఆ విజయాన్ని సోనియాకు పుట్టినరోజు కానుకగా అభివర్ణించిన స్థానిక నేతలు ఆమె జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావుతో 78 కిలోల కేక్‌ కట్‌ చేయించి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, ఇతర మంత్రులు, నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.