నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వివిధ శాఖలకు బదిలీ చేసిన తమను తిరిగి వీఆర్‌ఏలుగానే కొనసాగించాలని వీఆర్‌ఏ జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 55 ఏండ్లు పైబడిన వీఆర్‌ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఐదు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద వీఆర్‌ఏ జేఏసీ సమావేశం జరిగింది. అందులో జేఏసీ రాష్ట్ర నాయకులు వంగూరు రాములు, గోవింద్, రాజయ్య మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీఆర్‌ఏలను ఇరిగేషన్, మిషన్ భగీరథ, మున్సిపాలిటీ, పశుసంవర్ధక, తదితర శాఖలకు బదిలీ చేసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది వీఆర్‌ఏలున్నారనీ, వారిని ఇతర శాఖలకు పంపించడంతో అక్కడ పని చేయలేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెం.81, 85 ప్రకారం రాష్ట్రంలోని వీఆర్‌ఏలు చాలామంది ఇప్పటికే రిటైర్ అయ్యారనీ, మరి కొంతమంది ఒకటి, రెండు నెలల్లో రిటైర్మెంట్ కాబోతున్నారని చెప్పారు. 81, 85 జీవో ప్రకారం వారు నష్టపోయే ప్రమాదం ఉందని వాపోయారు. డిసెంబర్ 15న ప్రజాదర్బార్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖామంత్రి, సీసీఎల్‌ఏ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు. ప్రభుత్వం స్పందనను బట్టి తదుపరి కార్యాచరణ చేపడుతామన్నారు. కార్యక్రమంలో గిరిరావు, నాగయ్య, మల్సూర్, రాజు, యాకేష్, రాజేందర్, వెంకటస్వామి పాల్గొన్నారు.