భూ తగాదాలో వ్యక్తిపై చేయి చేసుకున్న ఎస్‌ఐ

– స్పృహ కోల్పోయి.. మృతిచెందిన బాధితుడు
–  ఆస్పత్రి ఎదుట మృతుని బంధువుల ధర్నా
నవతెలంగాణ- చింతపల్లి
భూతగాదాలో ఎస్‌ఐ చేయి చేసుకోవడంతో ఓ వ్యక్తి స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకెళ్తే.. మండలంలోని పాలెంతండా గ్రామానికి చెందిన నేనావత్‌ సూర్య(55), నేనావత్‌ భీమ్లా అన్నదమ్ములు. నేనావత్‌ సూర్య కుమారుడైన నేనావత్‌ రాజేష్‌ తన బాబాయి నేనావత్‌ భీమ్లా దగ్గర రూ.3 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్య కొంతకాలంగా పంచాయితీ నడుస్తోంది. కాగా ఇటీవల కాలంలో సూర్య, బీమ్లా తల్లి మృతి చెందింది. తల్లి పేరు మీద ఉన్న భూమిని సమానంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని గ్రామపెద్దలు సూచించారు. కాగా తన అన్న కుమారుడు రాజేష్‌ తనకు రూ.3 లక్షలు ఇవ్వకుండా గొడవపడుతున్నాడంటూ బీమ్లా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాంతో ఎస్‌ఐ సతీష్‌రెడ్డి రాజేష్‌ను, అతని తండ్రి సూర్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించాడు. ఈ క్రమంలో ఎస్‌ఐ ఇద్దరి అన్నదమ్ముళ్లకు సర్దిచెప్పినప్పటికీ వినలేదు. అదే సమయంలో భూమి విషయంలో ఎందుకు తలదూరుస్తున్నారని రాజేష్‌ ఎస్‌ఐను ప్రశ్నించడంతో.. పోలీసులు తన కొడుకును కొడతారేమోనని.. అడ్డంగా నిలబడతాడు. ఈ క్రమంలో ఎస్‌ఐ సూర్యను కొట్టడంతో కింద పడి స్పృహకోల్పోయాడు. దాంతో సూర్యను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బీపీ ఎక్కువ కావడంతో మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఆగ్రహించిన మృతుని బంధువులు పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. వ్యక్తి మరణించడంతో ఎస్‌ఐ స్టేషన్‌ నుంచి వెళ్లిపోవడమే కాక, ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాలేదు. సీఐ కూడా అందుబాటులో లేకపోరు.