ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా విష్ణుదేవ్‌ సారు..

– మాజీ సీఎంను కాదని బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం..
రారుపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా విష్ణుదేవ్‌ సారును బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. రారుపూర్‌లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో విష్ణుదేవ్‌ను బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. విష్ణుదేవ్‌ సాయి గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 2020 వరకు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నెరవేర్చారు. మాజీ సీఎం రమణ్‌సింగ్‌ను కాదని ఆయన్ను ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన విష్ణుదేవ్‌ సారును బీజేపీ హైకమాండ్‌ సీఎంగా ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం పదవి కోసం మాజీ సీఎం రమణ్‌సింగ్‌, రేణుకాసింగ్‌, అరుణా సావ్‌, విష్ణుదేవ్‌ సారు, ఓపీ చౌదరి పోటీ పడ్డారు. చివరకు ఎమ్మెల్యేలు విష్ణుదేవ్‌ సారు వైపు మొగ్గు చూపడంతో భారతీయ జనతాపార్టీ అధిష్టానం అతని పేరును ప్రకటించింది. ముగ్గురు కేంద్ర పరిశీలకుల పర్యవేక్షణలో కొత్త సీఎం ఎన్నిక జరిగింది. డిసెంబర్‌ 3న వెలువడిన ఛత్తీస్‌గఢ్‌ ఫలితాల తరువాత సీఎం ఎవరన్న దానిపై చర్చ నడుస్తూ వస్తోంది. బీజేపీ కేంద్ర నాయకత్వం నియమించిన పరిశీలకుడు కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా, సర్బానంద సోనోవాల్‌, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్‌ కుమార్‌ గౌతమ్‌ సమక్షంలో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌ సావ్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ రమణ్‌ సింగ్‌ కూడా హాజరయ్యారు. వీరితోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 54 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లో అంతకుముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే.