– చిన్నారితో సహా 8 మంది సజీవ దహనం
లక్నో : హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బరేలీ వద్ద జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు ట్రక్కును ఢకొీట్టింది. చిన్నారితో సహా ఎనిమిది మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘోర ఘటన ఉత్తరప్రదేశ్‌లో శనివారం (డిసెంబర్ 9) రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బోజిపురా సమీపంలో బరేలీ వద్ద జాతీయ రహదారిపై ఎనిమిది మంది ప్రయాణికులతో వస్తున్న కారు ట్రక్‌ను ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన తర్వాత కారు డోర్లు జామ్ అయ్యి, తెరుచుకోలేదు. కారులోని సెంట్రల్ లాక్ పడిపోవడంతో ఎవరూ బయటికి రాలేకపోతారు. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది మంటలకు ఆహుతయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. మంటల్లో దగ్దమైన కారు, ట్రక్కు నైనిటాల్ హైవే పక్కనే కనిపించాయి. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చేటప్పటికే మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారు పంక్చర్ అయినందున ఎదురుగా ఉన్న ట్రక్కును కారు ఢ కొట్టినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కారులో ఉన్న ఎనిమిది మంది సజీవ దహనమయ్యారని బరేలీ సీనియర్ సూపరింటెండెంట్ సుశీల్ చంద్ర భాన్ ధులే చెప్పారు.