ఈ ప్రతిజ్ఞలు సరిపోవు

– 30 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకుంటాం
– కాప్‌ 28 సదస్సుపై ఐఈఏ నివేదిక
దుబాయ్ : ప్రస్తుతం జరుగుతున్న కాప్‌ 28 సదస్సులో ఇప్పటి వరకూ చేసిన ప్రతిజ్ఞలు, వాగ్దానాలు సరిపోవని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) స్పష్టం చేసింది. ఈ ప్రతిజ్ఞలతో 2030 నాటికి చేరుకోవాల్సిన లక్ష్యాల్లో 30 శాతం మాత్రమే చేరుకుంటామని ఐఇఎ తన నివేదికలో తెలిపింది. ఐఇఎ విడుదల చేసిన తాజా నివేదికలో ప్రస్తుత ప్రతిజ్ఞలతో 2030 నాటికి తగ్గించాల్సిన గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను 30 శాతం మాత్రమే తగ్గించగలమని స్పష్టం చేసింది. ‘గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను పరిష్కరించడానికి ఇలాంటి ప్రతిజ్ఞలు సానుకూల అడుగుల గానే కనిపిస్తున్నా.. అంతర్జాతీయ వాతావరణ లక్ష్యాలను చేరుకునే మార్గంలోకి, ప్రధానంగా గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసే లక్ష్యానికి ప్రపంచాన్ని తీసుకుని వెళ్లడానికి ఈ ప్రతిజ్ఞలు సరిపోవు’ అని ఐఇఎ తన నివేదికలో తెలిపింది. దుబారులో ఈ నెల 12 వరకూ కాప్‌ 28 సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో వివిధ దేశాల ప్రభుత్వాలు, సంస్థలు చేసిన ప్రతిజ్ఞలపై అంచనా ఆధారంగా ఐఇఎ ఈ నివేదిక విడుదల చేసింది.
ఐరాస వాతావరణ సంస్థ వివరాల ప్రకారం ప్రతిజ్ఞలపై 130 దేశాలు సంతకాలు చేశాయి. అయితే ఇప్పటి వరకూ భారత్‌, చైనా, రష్యా, సౌదీ అరేబియాలు సంతకం చేయలేదు. తీవ్రతరమవుతున్న కరువు, తుఫాను, సముద్ర మట్టాల పెరుగుదల వంటి వాతావరణ మార్పుల యొక్క వినాశనాలను నివారించడానికి గ్లోబుల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా ఉంచాలని 2015 పారిస్‌ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2030 నాటికి మీథేన్‌ ఉద్గారలను సున్నా స్థాయికి తీసుకుని వస్తామని సుమారు 50 చమరు, గ్యాస్‌ కంపెనీలు వాగ్దానం చేశాయి. గ్రీస్‌హౌస్‌ వాయువుల వార్మింగ్‌లో మీథేన్‌ పాత్ర ఎక్కువగా ఉంటుంది. కార్బన్‌ డయాక్సైడ్‌ తరువాత రెండో స్థానంలో ఉంటుంది.