– ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంనాడే ఘటన
– ఢిల్లీ పోలీసుల తీరుపై విమర్శలు
న్యూఢిల్లీ : ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రజా సంఘాలకు వింత అనుభవం ఎదురైంది. జంతర్ మంతర్ ప్రాంతంలో నిర్వహించాల్సిన ప్రజా సంఘాల నిరసన సభకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంనాడే తమకు నిరసన చేసే అనుమతిని ఢిల్లీ పోలీసులు ఇవ్వకపోవటంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు సరికాదని అన్నారు. ఇది తమ హక్కులను హరించటమేనని ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ కారణాలల దృష్ట్యా నిరసనను అనుమతించలేదని న్యూఢిల్లీ అదనపు డిప్యూటీ కమిషనర్ రవికాంత్ కుమార్ అన్నారు. ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా పౌర హక్కులు, విద్యార్థి, ప్రజాస్వామ్య, మహిళా హక్కుల సంఘాలు, అనేక ఇతర సంస్థల కూటమి నవంబర్ 28న పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో నిరసన సభ కోసం అనుమతి కోసం దరఖాస్తు చేసింది. ఈ కార్యక్రమం భారతదేశంలో మానవ హక్కులపై చర్చించటంపై దృష్టి పెడుతుందని ఆయా సంఘాలు లేఖలో పేర్కొన్నాయి. ఈ కార్యక్రమంలో సీపీఐ జనరల్ సెక్రెటరీ డి రాజా, తెలంగాణలో అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే ఫోరం కన్వీనర్ జి హరగోపాల్, ఉద్యమకారుడు ఆసిఫ్ ఇక్బాల్ తన్హా, ఆదివాసీ హక్కుల కార్యకర్త సర్జూ టేకం, కార్మిక హక్కుల కార్యకర్త బచ్చా సింగ్‌తో సహా పలువురు హక్కుల కార్యకర్తలు పాల్గొనాల్సి ఉన్నది. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించటంతో పౌర హక్కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.