మేనల్లుడే రాజకీయ వారసుడు

మేనల్లుడే రాజకీయ వారసుడు– ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి
– పార్టీలో కీలకం కానున్న ఆకాశ్‌ ఆనంద్‌
లక్నో : బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి తన వారసు డిగా మేనల్లుడు ఆకాష్‌ ఆనంద్‌(28)ను ప్రకటిం చారు. దీంతో 2024లో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు మాయావతి తన రాజకీయ వారసుడి పేరును ప్రకటించటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. దీంతో చిన్న వయసులోనే ఆకాశ్‌ ఆనంద్‌ పార్టీలో ఆయన కీలకం కానున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ సన్నాహాలను పరిశీలించడానికి మాయావతి లక్నోలో ఏర్పాటు చేసిన అఖిల భారత బీఎస్పీ సమావేశంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు బీఎస్పీని బలోపేతం చేసే బాధ్యతను కూడా ఆకాష్‌కు అప్పగించారు.ఆకాష్‌ ఆనంద్‌ గత సంవత్సరం నుంచి పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆనంద్‌ మాయావతి తమ్ముడు ఆనంద్‌ కుమార్‌ కుమారుడు. ఆనంద్‌ కుమార్‌ 2019లో పార్టీ ఉపాధ్యక్షుడిగా, ఆకాష్‌ ఆనంద్‌ జాతీయ కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. ఈ సమావేశానికి హాజరైన బీఎస్పీ నేత ఉదయవీర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ”బీఎస్పీ అధినేత్రి మాయావతి తన వారసుడిగా ఆకాష్‌ ఆనంద్‌ను ప్రకటించారు. ఆకాష్‌ ఆనంద్‌ బీఎస్పీ ఉనికిని, పార్టీ బలహీనంగా ఉన్న చోట ఎన్నికల సన్నాహాలను పరిశీలిస్తారు. బెహెన్‌ జీ (మాయావతి) యూపీ, ఉత్తరాఖండ్‌లలో పార్టీకి నాయకత్వం వహిస్తారు. ఆనంద్‌ జీ ఇతర రాష్ట్రాల్లో పార్టీకి నాయకత్వం వహిస్తారు” అని తెలిపారు.