ఉపాధ్యాయ సంక్షేమంపై నూతన ప్రభుత్వం కేంద్రీకరించాలి

ఉపాధ్యాయ సంక్షేమంపై
నూతన ప్రభుత్వం కేంద్రీకరించాలి– ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పాలి : టీఎస్‌ యుటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిన మార్పుకు అనుగుణంగా విద్యారంగంలో కూడా మార్పులు రావాలనీ, విద్యా రంగాన్ని సమీక్షించాలని ఉపాధ్యాయులందరూ ఎదురుచూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌ యుటీఎఫ్‌) రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ కొలువుదీరిన నూతన ప్రభుత్వం ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యా శాఖ, ముఖ్యమంత్రితోనే ఉన్నందున విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తారనీ, ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలనీ, పర్యవేక్షణా వ్యవస్థను పునరుద్దరించాలనీ, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని వారు కోరారు. రాష్ట్రం ఏర్పడి పదేండ్లైనా సర్వీస్‌ అసోసియేషన్లకు గుర్తింపు ప్రక్రియను కానీ, సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని కానీ ఆలోచించలేదని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుని, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తుందని రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీఎస్‌యుటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె. జంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌కు సంబం ధించి తొమ్మిదన్నరేండ్లుగా గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పట్టించుకోక పోవడంతో పర్యవేక్షణ వ్యవస్థ కుంటుపడిరదని తెలిపారు. అన్ని జిల్లాలకు డీఈఓ పోస్టులు, మండలాలన్నింటికి యంఈఓ పోస్టులు, అదనపు డిప్యూటి డీఈఓ పోస్టుల మంజూరు, పదోన్నతుల ద్వారా అన్ని పాఠశాలలకు హెడ్‌ మాస్టర్‌ పోస్టులు, సబ్జెక్టు పోస్టులు భర్తీ చేయడం ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యతగా ఉండాలని సూచించారు. కె.జి.బి.వి., గురుకుల, కాంట్రాక్టు తదితర సమస్యల, బదిలీలపై సంఘాలతో సానుకూల ప్రజాస్వామ్యయుత పద్ధతిలో ఎప్పటికప్పుడు చర్చించే వెసులు బాటు వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని కోరారు. అర్థాంతరంగా నిలిచిపోయిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలనీ, జీవో 317 బాధితులకు న్యాయం చేయాలనీ, మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోవాలనీ, పెండింగ్‌ డీఏలు మంజూరు చేయాలనీ, ట్రెజరీల్లో ఆమోదం పొంది కొన్ని నెలలుగా విడుదల కాని బిల్లులన్నింటినీ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌. రాములు, సిహెచ్‌. దుర్గాభవాని, కోశాధికారి టి. లక్ష్మారెడ్డి, పత్రిక ప్రధాన సంపాదకులు పి.మాణిక్‌రెడ్డి, కుటుంబ సంక్షేమ నిధి కార్యదర్శి యం. రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి జి.నాగమణి, రాష్ట్ర కార్యదర్శులు ఎ.వెంకటి, వి.శాంతకుమారి, బి.రాజు, కె.రవికుమార్‌, డి. సత్యానంద్‌, జి. శ్రీధర్‌, ఎ.సింహాచలం, ఆర్‌.రంజిత్‌కుమార్‌, యస్‌.వై.కొండల్‌రావు, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ యస్‌.కె. మహబూబ్‌ అలీతోపాటు 33 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.