– 162 మంది రోగులకు వైద్య సేవలు
నవతెలంగాణ-నేలకొండపల్లి
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు అమరజీవి నూతక్కి గంగాధర్ రావు సేవా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సీపీఐ(ఎం) కార్యాలయం రావెళ్ల సత్యనారాయణ భవనంలో జరిగిన నెల నెల వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ వైద్య శిబిరంలో 162 మంది రోగులకు డాక్టర్లు వైద్య సేవలు అందించారు. వైద్య శిబిరంలో షుగర్, బీపీ, గ్యాస్ ట్రబుల్ జబ్బులకు నెలకు సరిపడా మందులను కేవలం 100 రూపాయలకే అందించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ కొల్లి అనుదీప్(ఎండి జనరల్ మెడిసిన్), డాక్టర్ గుడిపూడి రాజేష్ (చెవి మొక్కు గొంతు ప్రత్యేక వైద్యులు), డాక్టర్ హస్నద్ బాబా (ఎంబీబీఎస్) రోగులకు వైద్య సేవలు అందించారు. 80 మంది షుగర్ వ్యాధిగ్రస్తులకు, 24 మందికి చెవి ముక్కు గొంతు సమస్యలకు, 20 మందికి సాధారణ జబ్బులకు వైద్య సేవలు అందించగా మరో 38 మందికి శరత్ మాక్సి విజన్ వారిచే కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. నేలకొండపల్లి గ్రామీణ వైద్యుల సంఘం నుండి బండి పుష్పలత, నాగేశ్వరరావు, తానీషా, రోగులకు బిపి చెకప్ చేయగా, వసుంధర ఒకేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఈగ అనిల్ కుమార్, విద్యార్థులు ఔషధాల పంపిణీ, రక్త పరీక్ష సేవలు అందించారు. ఈ సందర్భంగా ఎన్ జి ఆర్ సేవ కమిటీ కన్వీనర్ ఏటుకూరి రామారావు మాట్లాడుతూ నెల నెల వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలను కూడా విస్తృతంగా చేపట్టాలనే లక్ష్యంతో ప్రతి నెల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో వీటికి అనుబంధంగా మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రతినెలా సహకరిస్తున్న దాతలకు, డాక్టర్లు, సిబ్బంది, వాలంటీర్లు, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జీఆర్ సేవాకమిటీ సభ్యులు కె.వి రామిరెడ్డి, గుడవర్తి నాగేశ్వరరావు, వల్లంచెట్ల భాస్కరరావు దండా సైదారావు, దండ సూర్యనారాయణ, అపర్ణ, సతీష్, మంకెనపల్లి నరసింహారావు, భార్గవ, నాగేశ్వరరావు, ఎస్.కె రహీం, ఎస్కే జమాల్, బొడ్డు బాబురావు, మల్లికార్జున్ వాలంటీర్లుగా సహకరించారు.