– మేడిగడ్డను సందర్శిస్తా.. ఏర్పాట్లు చేయండి
– పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ హోదాకు కృషి
– కృష్ణాజలాల్లో న్యాయమైన వాటాకు చర్యలు : భారీనీటిపారుదలశాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హదరాబాద్
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై విచారణ చేస్తామని రాష్ట్ర భారీ, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఆ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తాననీ, అందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని భారీ నీటిపారు దల, ఆయకట్టు అభివృద్ధి శాఖ రాష్ట్ర కార్యాలయం జల సౌధలో సంబంధిత శాఖపై సమీక్ష చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు, కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా, చెరువుల నిర్వహణ తదితర అంశాలపై ఉన్నతాధికారులతో పూర్తిస్థాయిలో దాదాపు గంటన్నరపాటు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగడం తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించారు. నిర్మాణం చేపట్టిన ఏజెన్సీని, అధికారులు తన పర్యటనలో ఉండేలా చూడాలని ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్‌ను ఆదేశించారు. వచ్చేవారం నుంచి ప్రతి ప్రాజెక్టుపై విడివిడిగా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహి స్తానని అన్నారు. మేడిగడ్డను ఎవరు నిర్మించినా, జరిగిన ఘటనలకు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రాజెక్టు కట్టిన ఏజెన్సీ, అధికారులు జబాబుదారులని స్పష్టం చేశారు. ‘రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కింద నామమాత్రం కొత్త ఆయకట్టు ఉంది. ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు వివరాలు చెప్పాలని అధికారులను అడిగా.ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పురోగతిపై ఆరా తీశాను..సొరంగం పనుల చేస్తున్న సంస్థకు బిల్లులు బకాయి ఉన్నట్టు తెలిసింది..రాష్ట్రంలోని 40 వేల చెరువుల నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటా’ అని చెప్పారు. కృష్ణాజలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటాకోసం కృషిచేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల సైటు మార్చి, పేరు మార్చి, ఖర్చుపెంచినా పాలమూరు-రంగారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాగే తక్కువ ఖర్చుపెడితే పూర్తయ్యే ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని, వాటిపై కూడా దృష్టిపెడతామని ప్రకటించారు. అమూల్యమైన ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తామని స్పష్టం చేశారు. అనేక రకాల అరోపణలు ఉన్నాయనీ, విచారించి నిగ్గుతేలుస్తామని అన్నారు. రహాస్యం, గోప్యం ఉండకూడదనీ, అవినీతి జరగకూడదన్నారు. అందుకే రాతపూర్వక నివేదిక అడిగినట్టు పేర్కొన్నారు. ప్రతిప్రాజెక్టు కొత్తఆయకట్టు లెక్కలు చెప్పాల్సిందేనని అన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఆధారంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పోలింగ్ రోజు నాగార్జునసాగర్ డ్యాంపై జరిగిన తంతు అనుమానా స్పదంగా ఉందన్నారు. కాళేశ్వరంపై విచారణ ఉన్నతాధికారు లతో చేయిస్తారా ? లేక సీఐడీతోనా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ఇంకా అంతవరకు ఆలోచించలేదనీ, క్యాబినెట్, సీఎంతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని’ చెప్పారు.
ఆ సమాచారమివ్వండి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై పూర్తి సమాచారం సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీనిపై ప్రత్యేకంగా సమీక్ష చేద్దామన్నారు. సీబ్ల్యూసీ అనుమతి లేకుండా ప్రాజెక్టులు ఏలా నిర్మిస్తారు ? నిధులు ఎలా సమీకరించారు ? అని ప్రశ్నించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ధర్డ్‌పార్టీ చెకింగ్ లేదా ? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సీడబ్ల్యూసీ అనుమతి ఉందా ? పాత ఆయకట్టును కూడా ఎందుకు కొత్త ఆయకట్టులో కలుపుతున్నారు ? వర్షం వచ్చినప్పుడు నీటిని లిఫ్ట్చేయాల్సిన అవసరం లేదు కదా ? నీటిపారుదల శాఖ పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా సమర్థంగా పనిచేయాలి. ఇదివరకు నీటిపారుదలశాఖలో ఏదో జరిగిందని అనుమానాలు ఉన్నాయి, వందేండ్లు ఉండాల్సిన ప్రాజెక్టులు మూడేండ్లకే దెబ్బతినడం ఆందోళనకరం. ఎందుకు అలా జరిగింది ? మంత్రి అధికారులను అడిగారు. దీంతో ఈఎన్సీలు, సీఈలు, ఎస్ఈలు తెల్లమోహలేసినట్టు తెలిసింది. ఒక్క ఈఎన్సీ మురళీధర్ మినహా మరెవరూ జవాబు చెప్పే సాహసం చేయలేకపోయినట్టు సమాచారం. దీంతో ప్రాజెకుల్ట వారీగా పూర్తివివరాలతో సమీక్షకు వస్తామని అధికారులు చెప్పారు.
చెప్పినా రాని స్మీతాసభర్వాల్
మాజీ సీఎం కార్యదర్శి, సాగునీటిశాఖ ఇన్చార్జీ కార్యదర్శిగా నియమితులైన స్మీతాసభర్వాల్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షకు హాజరుకాలేదు. గైర్హాజరుకు ఎలాంటి కారణాలు తెలియజేయలేదు. దీంతో చేసేది లేక ఇంజినీర్ ఇన్ చీఫ్ సి మురళీధర్ జలసౌధ సమీక్ష సమావేశానికి మంత్రి ఉత్తమ్‌ను ఆహ్వానించారు. ఆయన వచ్చే సమయానికి ఈఎన్సీలు, సీఈలు, ఇతర అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి స్వాగతం పలికారు.
వాడీవేడిగా సమీక్ష
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై మంత్రికి అధికారులు వివరణ ఇచ్చారు. ‘మేడిగడ్డ బ్యారేజీ నిర్మానానికి రూ.4600 కోట్లు ఖర్చు చేశాం..అందులోని ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగడంతో, మరో మూడు పిల్లర్లపై ఆ ప్రభావం పడింది..ముందురోజు సాయంత్రం పిల్లర్ కుంగిన వెంటనే ప్రాజెక్టులో నీటిని తోడేశాం..నీటిని తోడిన తర్వాత పిల్లర్ కుంగడం తగ్గింది” అని అధికారులు మంత్రికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ ప్రాజెక్టులపై సమగ్రంగా పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. దీనికి స్పందించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇది తీవ్రమైన అంశమనీ, ప్రాజెక్టు సందర్శనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
‘అక్కడ ఖర్చు చేసిందెంత ? ఎంత ఆయకట్టుకు నీరిచ్చేందు కు నిర్మాణం జరిగింది ? ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న వ్యయమెంత ? అని అధికారులను మంత్రి ప్రశ్నించారు. ఈసమీక్షలో మురళీధర్‌తోపాటు జనరల్ ఈఎన్సీ బి. అనిల్‌కుమార్, కాళేశ్వరం సీఈ వెంకటేశ్వర్లు, సాగునీటిశాఖ సలహాదారు పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.