దక్షిణ మధ్య రైల్వేకు ఏడు విభాగాలకు ఇంధన పరిరక్షణ అవార్డులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంధన పరిరక్షణకుగాను దక్షిణ మధ్య రైల్వే ఏడు విభాగాల్లోఅవార్డులను సొంతం చేసుకుంది. గురువారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌, విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి కిషన్‌ పాల్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల కేటగిరీలో హైదరాబాద్‌ ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ (పిఆర్‌ఎస్‌ ) భవనం ప్రథమ బహుమతిని పొందింది. రైల్వే వర్క్‌ షాప్‌ విభాగంలో విజయవాడలోని వ్యాగన్‌ డిపో ప్రధమ బహుమతిని అందుకుంది. జోనల్‌ రైల్వేల విభాగంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు, ప్రభుత్వ కార్యాలయాల వర్గం లో లేఖ భవన్‌ (దక్షిణ మధ్య రైల్వే అకౌంట్స్‌ ఆఫీస్‌ భవనం ) ద్వితీయ బహుమతులు పొందాయి. ప్రభుత్వ కార్యాలయాల విభాగంలో రేణిగుంట రన్నింగ్‌ రూమ్‌ గుంతకల్‌ రన్నింగ్‌ రూమ్‌, గుంతకల్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయాలు మెరిట్‌ సర్టిఫికెట్లు అందుకున్నాయి. న్యూఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులందుకున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌, విజయవాడ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ నరేంద్ర ఎ.పాటిల్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. సమిష్టి పనితనంతోనే వరసగా అవార్డులు సాధించుకోగలుగుతున్నామని అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు.