నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర సలహాదారులు ఎంఏకే దత్తు లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని, ఆయన మృతి పౌర సమాజానికి తీరని లోటని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఇటీవల మరణించిన ఎంఏకే దత్తు సంస్మరణ సభ గురువారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభకు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పౌర స్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాదే శ్యామ్ హాజరయ్యారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఎంఏకే దత్తు ఏ ఆశయం కోసమైతే నిలబడ్డారో ఆ ఆశయ సాధన కోసం చివరి వరకు కట్టుబడి ఉన్నారన్నారు. అటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం యావత్ సమాజానికి, ఉద్యమాలకు, తెలంగాణ పౌర వేదికకు తీరని లోటన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి అంశంపైనా తన అనుభవాలను ఇతరులకు తెలియజేస్తూ.. వారి నుంచి తనకు తెలియని వాటిని గ్రహించడం దత్తు గొప్పతనం అన్నారు. తమ ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉండేవని, సమ సమాజ స్థాపన, ఉపాధ్యాయులు, ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడూ ఒకే విధంగా ఆలోచించే వాళ్లమని చెప్పారు. ప్రతి పనిలో నిమగమై పూర్తిచేసే వరకు ఏకాగ్రతతో దత్తు పని చేసేవారని గుర్తు చేశారు. అటువంటి గొప్ప ఉపాధ్యాయున్ని, ఉద్యమ నాయకున్ని కోల్పోవడం బాధాకరమన్నారు. సమాజాన్ని, కుటుంబాన్ని ఒకే విధంగా చూసే అతి కొద్దిమంది నాయకులలో దత్తు ఒకరని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.