– పాత అసెంబ్లీ భవనంలోకి మండలి
– ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై సమావేశం
– ఎంఐఎం, హైదరాబాద్ ప్రజా ప్రతినిధులతో సమావేశం
– అసెంబ్లీ వద్ద ముళ్లకంచెల తొలగింపుపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సమావేశం
– మండలిలో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అవకతవకతలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసనమండలిలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం పగిలిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఇసుక మీద బ్యారేజీ కట్టినట్టు ఎక్కడా లేదని తెలిపారు. నిర్మించిన మూడేండ్లకే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాల అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాళేశ్వరం సందర్శనకు తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ.. ప్రభుత్వంలో ఉండి పదే పదే కాళేశ్వరంలో ఏదో జరిగినట్టు విమర్శించడమెందుకు?… విచారణ జరిపించుకోవాలని సూచించారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రతిస్పందిస్తూ… కవిత మంచి సూచన చేశారు, ఇలాంటి సూచనలను స్వీకరిస్తామనీ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, దోషులను శిక్ష పడేలా చూస్తామని బదులిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ విధానపరంగా ఇబ్బంది ఉంటే మిగిలిన సభ్యులను తీసుకెళ్లి చూపిస్తామని తెలిపారు.
ప్రస్తుత శాసనమండలిని పాత అసెంబ్లీ భవనంలోకి మారుస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభ, శాసనమండలి ఒకే దగ్గర ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మండలిని పాత భవనంలోకి మార్చేందుకు నిర్ణయించి, ఆ మేరకు బడ్జెట్ను కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాసనసభ సమావేశాలు ముగిశాక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సీఎం తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, సంబంధిత అధికారులతో నిర్వహించబోయే ఈ సమావేశంలో ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించనున్నట్టు హామీ ఇచ్చారు.
మూసీనది సమస్యలతో పాటు పాత నగరంలో మెట్రో విస్తరణ, మైనార్టీల సంక్షేమం తదితర అంశాలను చర్చించేందుకు ఎంఐఎం సభ్యులు, హైదరాబాద్లోని ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.
అసెంబ్లీ వద్ద ఉన్న ముళ్ల కంచెలను తొలగించాలని బీఆర్ఎస్ సభ్యులు దేశపతి శ్రీనివాస్ చేసిన విజ్ఞప్తిపై సీఎం స్పందిస్తూ, ఆ అంశం ప్రభుత్వ పరిధిలో ఉండబోదని స్పష్టం చేశారు. దీనిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మెన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఎంఐఎంను మోసం చేసిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత స్నేహంలో పడొద్దనీ చెబుతూనే ఉన్నామని ఎంఐఎంను ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు. లబ్దిదారులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని ఎంఐఎం ఎమ్మెల్సీ బేగ్ చెప్పగా, రేవంత్ స్పందిస్తూ తాము మొదట్నుంచి బీఆర్ఎస్ తో దోస్తానా చేస్తే మోసం చేస్తుందని ఎంఐఎంకు చెబుతూనే ఉన్నామన్నారు. చివరకు అదే జరిగిందనీ, మోసం చేసే వాళ్లే బౌన్స్ అయ్యే చెక్కులిస్తారని తెలిపారు.
ఎర్రజెండా నీడన…..
తెలంగాణ ప్రజలు నిర్బంధం పెరిగినప్పుడల్లా స్వేచ్ఛ కోసం పోరాడారని రేవంత్ గుర్తుచేశారు. నైజాం రాచరికానికి వ్యతిరేకంగా ఎర్రజెండా నీడన సాగిన పోరాటం చేశారని తెలిపారు. 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమం కొన్ని హక్కులను సాధించుకోగలిగిందని తెలిపారు. ఉమ్మడి పాలనలో సమాన అభివృద్ధి లేక జరిగిన మలి దశ పోరాటం, కీర్తిశేషులు జైపాల్ రెడ్డి వ్యూహంతో పలు రకాల ఆటంకాల మధ్య తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. 2004లో స్వరాష్ట్ర హామీ ఇచ్చిన సోనియాగాంధీ 2014లో ఆ మాట మేరకు తెలంగాణ ఇచ్చారన్నారు. రాష్ట్రం వచ్చి పదేండ్లు గడిచినా నీళ్లు, నియామకాలు, నిధుల్లో అదే వివక్ష కొనసాగుతుందనే భావన ప్రజల్లో ఉండిపోయిందని తెలిపారు. ఆ నిర్బంధం లేకుండా ఆరు గ్యారంటీలతో పాటు ప్రజాస్వామిక పాలన అందిస్తామనే హామీలతో ప్రజలకు కాంగ్రెస్కు పట్టం కట్టారన్నారు. గతంలో బీఆర్ఎస్కు, ప్రజలకు మధ్య సంబంధం తెగిందని తెలిపారు. కులసంఘాలు, పౌర హక్కుల సంఘాలు స్వేచ్ఛాయుతంగా నిరసన తెలుపుకోవచ్చని తెలిపారు. ప్రగతిభవన్ ముళ్ల కంచెలను బద్ధలు కొట్టామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వాధీశులు.. సమైక్య పాలకులను ఆదర్శంగా తీసుకున్నారేమో… వారు వేసిన కంచెలను అలాగే కొనసాగించారని ఎద్దేవా చేశారు.