మహేంద్ర అండ్‌ మహేంద్ర ట్రాక్టర్‌

మహేంద్ర అండ్‌ మహేంద్ర ట్రాక్టర్‌– ప్లాంట్‌లో సీఐటీయూ విజయకేతనం
–  ఈ విజయం కార్మికులకే అంకితం : చుక్క రాములు
నవతెలంగాణ- జహీరాబాద్‌
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలోని మహేంద్ర అండ్‌ మహేంద్ర ట్రాక్టర్‌ ప్లాంట్‌లో శనివారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో అధ్యక్షులుగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ఘన విజయం సాధించారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించిన లేబర్‌ కమిషన్‌ అధికారులు ఐదు గంటలకు ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో 410 ఓట్లకుగాను 403 ఓట్లు పోలయ్యాయి. సీఐటీయూకు 227 ఓట్లు, టీఆర్‌ఎస్‌కేవీకి 151 ఓట్లు పోలయ్యాయి. 76 ఓట్ల మెజారిటీతో సీఐటీయూ విజయకేతనం ఎగురవేసింది. మొదటిసారి పోటీ చేసిన బీఎంఎస్‌కు 25 ఓట్లు మాత్రమే వచ్చాయి. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు 76 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
భారీ విజయోత్సవ ర్యాలీ
మహేంద్ర అండ్‌ మహేంద్ర ట్రాక్టర్‌ ప్లాంట్‌లో సీఐటీయూ ఘన విజయం సాధించిన అనంతరం పరిశ్రమ గేటు నుంచి టెక్నీషియన్స్‌ కాలనీ వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల సంక్షేమం కోసం నిరంతర పోరాడుతున్న సీఐటీయూ విజయం తమ జీవితాల్లో కొత్త మలుపు తీసుకొస్తుందంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. సీఐటీయూ విజయం కార్మికుల విజయమన్నారు. ఈ విజయాన్ని వారికే అంకితం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోనే మెరుగైన వేతన ఒప్పందం చేసిన ఘనత సీఐటీయూకే దక్కుతుందన్నారు.