– అర్షదీప్ దెబ్బకు సఫారీ విలవిల తొలి
– వన్డేలో భారత్ ఏకపక్ష విజయం
జొహనెస్‌బర్గ్: వాండరర్స్‌లో భారత పేసర్లు అర్షదీప్ సింగ్ (5/37), అవేశ్ ఖాన్ (4/27) నిప్పులు చెరిగారు. అర్షదీప్ సింగ్ స్వింగ్ బంతులతో, అవేశ్ ఖాన్ పేస్‌తో చెలరేగటంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. 27.3 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా కథ ముగిసింది. టెయిలెండర్ అండిల్ ఫెలుక్‌వయో (33 49 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), టోనీ డీ జార్జీ (28, 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సఫారీలకు గౌరవప్రద స్కోరు అందించారు. స్వల్ప లక్షాన్ని టీమ్ ఇండియా అలవోకగా ఛేదించింది. సాయి సుదర్శన్ (55 నాటౌట్, 43 బంతుల్లో 9 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (52, 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో 16.4 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. మరో 200 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఐదు వికెట్ల వీరుడు అర్షదీప్ సింగ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. భారత్, దక్షిణాఫ్రికా రెండో వన్డే మంగళవారం పోర్ట్ ఎలిజబెత్‌లో జరుగనుంది.
అర్షదీప్ అదుర్స్: టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీకి అర్షదీప్, అవేశ్ చుక్కలు చూపించారు. తొలి స్పెల్‌లో పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇబ్బంది పడిన అర్షదీప్.. రెండో స్పెల్‌లో వికెట్ల జాతర సాగించాడు. హెండ్రిక్స్ (0), వాన్‌డర్ డసెన్ (0), క్లాసెన్ (6), టోనీ (28), ఫెలుక్‌వయో (33) అర్షదీప్ దెబ్బకు పెవిలియన్ బాట పట్టారు. 52 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా.. 116 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై సఫారీలకు ఇదే అత్యలప్ప స్కోరు కావటం విశేషం. దక్షిణాఫ్రికాలో ఆ జట్టుపై ఐదు వికెట్లు కూల్చిన తొలి పేసర్‌గా అర్షదీప్ నిలిచాడు. అవేశ్ ఖాన్ సైతం నాలుగు వికెట్లతో చెలరేగాడు. పదో వికెట్‌ను కుల్దీప్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఛేదనలో ఓపెనర్ రుతురాజ్ (5) విఫలమైనా.. శ్రేయస్ (52), అరంగ్రేట సాయి సుదర్శన్ (55) అర్థ సెంచరీలతో మెరిశారు.